
తిరుపతిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే పులివర్తి నానిని అరెస్టు చేయాలని వైఎస్సార్‌సీపీ ఆందోళన
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి ఆయనను వెంటనే అరెస్టు చేయాలని వైయస్‌ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరుపతి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు వైయస్‌ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా భారీ ర్యాలీగా బయలుదేరారు.
అయితే, ఈ ర్యాలీ ఎస్పీ కార్యాలయానికి చేరకముందే భారీ పోలీసు బలగాలు రంగంలోకి దిగి వైయస్‌ఆర్సీపీ శ్రేణులను అడ్డుకున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా వినతిపత్రం ఇచ్చే అవకాశాన్ని కూడా నిరాకరించడంతో, చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఎస్పీ కార్యాలయం ప్రధాన గేటు వద్దనే బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.
పోలీసులకు, వైయస్‌ఆర్సీపీ శ్రేణులకు మధ్య తీవ్ర తోపులాట జరగడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు బూటు కాళ్లతో తొక్కి, లాఠీలతో కొట్టి, ఈడ్చుకెళ్లారని వైయస్‌ఆర్సీపీ ఆరోపించింది. ఈ లాఠీఛార్జ్‌లో పలువురు నాయకులు, కార్యకర్తలకు రక్తగాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలను అరెస్ట్ చేసి, అనంతరం విడుదల చేశారు.
అరెస్ట్ అనంతరం చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. బూతులు మాట్లాడిన అధికార పార్టీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, ఫిర్యాదు చేయడానికి వచ్చిన ప్రతిపక్షంపైనే పోలీసులు ప్రతాపం చూపడం దుర్మార్గమన్నారు. పోలీసులు చట్టాన్ని అమలు చేస్తున్నారా లేక పసుపు చొక్కాలు వేసుకున్న టీడీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారా? చట్టం అధికార పార్టీకి ఒకలా, ప్రతిపక్షానికి మరోలా అమలవుతుందా? అని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రతిపక్ష గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే పులివర్తి నానిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
