Let's talk: editor@tmv.in
అనంతపురంలో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నిరసనలు

అనంతపురంలో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నిరసనలు

Gaddamidi Naveen
27 జూన్, 2026

జూన్ 23న తాడిపత్రిలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. ఈ ఘర్షణలను నిరసిస్తూ ఇరు పార్టీలు పరస్పర నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో జిల్లా వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. శాంతిభద్రతల సమస్యలను దృష్ట్యా పోలీసులు ఇరు పార్టీల నిరసనలకు అనుమతి నిరాకరించారు.

వైసీపీ కేంద్ర కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం.. తాడిపత్రి హింసను ఖండిస్తూ అనంతపురంలోని వైసీపీ జిల్లా అధ్యక్షుడి నివాసం ముందు నిరసన తెలపాలని అధికార పక్షం టీడీపీ పిలుపునిచ్చింది. మరోవైపు, అదే ఘటనకు నిరసనగా తాడిపత్రిలో ఉమ్మడి ధర్నా, మౌన ప్రదర్శన నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా ఈ రెండు కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల నిర్ణయం అనంతరం టీడీపీ నేతలు తమ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. కానీ వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు మాత్రం ముందుగా ప్రకటించినట్లుగానే తాడిపత్రికి వెళ్లి మౌన నిరసన చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

ఈ నేపథ్యంలో అనంతపురం పట్టణంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా భద్రతను మరింత కట్టుదిట్టం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాడిపత్రికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లా పార్టీ కార్యాలయం సమీపంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని గృహనిర్బంధంలో ఉంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా ఉండేందుకు ఇరు పార్టీల నాయకులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్‌లు
AnantapurTadipatriAndhraPradeshAPPoliticsTDPYSRCPPoliticalNewsBreakingNewsTeluguNewsAndhraNewsLawAndOrderPoliceAnantapurNews
అనంతపురంలో ఉద్రిక్తత.. టీడీపీ-వైసీపీ నిరసనలు - Tholi Paluku