Let's talk: editor@tmv.in
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఇళ్లకు త్వరలో టెండర్లు: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

పేదలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది . కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ వంటి నగర పరిధిలోని (క్యూర్) ఇన్నర్ రింగ్ రోడ్ ప్రాంతంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే టెండర్లు పిలవనుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మూడు కార్పొరేషన్ల పరిధిలో ఈ భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టు చేపట్టబోతున్నట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన స్థల సేకరణ ప్రక్రియ తుది దశకు చేరిందని, మరో రెండు నుంచి మూడు రోజుల్లో ఈ భూముల గుర్తింపు పూర్తి కానుందని ఆయన స్పష్టం చేశారు.

19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్

నగర పరిధిలోని 19 నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ గృహ నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు మంత్రి వివరించారు. తొలి దశలో ఒక్కో నియోజకవర్గంలో కనీసం 500 నుండి 1,000 ఇళ్ల వరకు నిర్మించ తలపెట్టామని, ఆ తర్వాత రెండు, మూడో విడతల్లో మిగిలిన అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 5,500 ఇళ్ల చొప్పున కేటాయించామని గుర్తుచేసిన ఆయన, పట్టణ ప్రాంతాల్లో కూడా అదే స్థాయిలో అత్యంత పారదర్శకంగా ఇళ్ల నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.

రూ.200 కోట్ల విలువైన భూముల్లో పేదల గృహాలు

పట్టణ ప్రాంతాల్లో భూమి విలువ ఎకరాకు రూ.100 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు పలుకుతున్నప్పటికీ, పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి అన్నారు. మార్కెట్ విలువను పక్కనబెట్టి, పేదలకు వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇళ్లు నిర్మించి, వారి పేరిటే పట్టాలు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వాల తరహాలో పేదలను నగరాలకు 30 కిలోమీటర్ల దూరంలోకి తరలించే విధానానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్తి పలికిందని, వారి జీవనాధారానికి ఇబ్బంది కలగకుండా అదే నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు అందించడం ప్రభుత్వ కట్టుబాటు అని పునరుద్ఘాటించారు.

గోషామహల్‌ లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ

గోషామహల్ నియోజకవర్గ పరిధిలో గతంలో నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించిన పట్టాలను గురువారం నాడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధూల్‌పేట ప్రాంతంలో గత ప్రభుత్వ కాలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన 125 ఇళ్ల నిర్మాణాన్ని తమ ప్రభుత్వం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిందని, మిగిలిన అర్హులైన పేదల కోసం పరిసర ప్రాంతాల్లో స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు.

విపక్షాలకు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే, కేవలం రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలోనే అత్యధిక ఇళ్లను నిర్మించి చూపిస్తామని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే తాను రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని గతంలోనే ప్రకటించానని, అయితే ఆ సవాల్‌కు బీఆర్ఎస్ నేతల నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని ఎద్దేవా చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి ఆర్థిక ప్రయోజనం లేదనే స్వార్థపు ఆలోచనతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం గృహ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేసిందని, భారీ ప్రాజెక్టుల పేరుతో అవినీతికి పాల్పడిందని ఆయన ఆరోపించారు.

గుడిసెల్లేని తెలంగాణే కాంగ్రెస్ లక్ష్యం

గత ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట వృధా చేసిన నిధులను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల గూడు కోసం (ఇందిరమ్మ ఇళ్లకు) మళ్లిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షపాతి అని, "ప్రతి పేద కుటుంబానికి ఇల్లు" అనే నిర్దిష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతోందని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దశలవారీగా సొంత ఇల్లు కల్పించి తీరుతామని భరోసా ఇచ్చారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేస్తూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా రాష్ట్రంలో 'గుడిసెల్లేని తెలంగాణ' స్వప్నాన్ని సాకారం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
IndirammaIlluIndirammaHousingTelanganaHousingPonguletiSrinivasaReddyRevanthReddyTelanganaGovernmentHyderabadNewsTelanganaNewsCOREAreaInnerRingRoadIndirammaSchemeHousingProjectsHousingForAllAffordableHousingPoorWelfareUrbanDevelopmentLandAcquisitionCongressGovernmentTelanganaDevelopmentBreakingNews