Let's talk: editor@tmv.in
నేడు తెలంగాణ‌లో ‘ప‌ది’ ఫలితాలు విడుద‌ల‌

నేడు తెలంగాణ‌లో ‘ప‌ది’ ఫలితాలు విడుద‌ల‌

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

తెలంగాణ పది పరీక్ష ఫలితాల పై కీలక అప్డెట్ వచ్చేసింది. విద్యార్థులకు తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు విడుదల కానున్న ప‌ది ఫలితాలను-2026, ఇప్పుడు వెబ్‌సైట్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ వాట్సాప్ లోనే పొందవచ్చు. నేడు బషీర్ బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ క్యాంపస్‌లోని గోదావరి ఆడిటోరియంలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయనున్నారు.

ఇక మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలో సుమారు 5.17 లక్షల మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈనెల 24వ తేదీతో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది. తెలంగాణ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం, మీ సేవ చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ వినూత్న సేవను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో, విద్యార్థులు వెబ్‌సైట్లలో ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా వేగంగా ఫలితాలు పొందేందుకు ఈ ఏర్పాటు చేశారు.

వాట్సాప్ ద్వారా ఫలితాలు పొందే సులువైన పద్ధతి

ముందుగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను ‘మీసేవ తెలంగాణ‌’ గా సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. తర్వాత వచ్చే ఆప్షన్లలో “ఎస్ఎస్‌‌సీ రిజల్ట్స్” అని టైప్ చేయండి. ఓపెన్ స‌ర్వీస్ బటన్‌పై క్లిక్ చేసి, మీ హాల్ టికెట్ నంబర్ నమోదు చేయండి. వివరాలు పంపిన వెంటనే మీ మార్కుల మెమో వాట్సాప్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

నవంబర్ 2025లో ప్రారంభమైన మీ సేవ వాట్సాప్ సేవలు ఇప్పటికే జనన, ఆదాయ ధృవీకరణ పత్రాలు, పోలీస్ చలాన్లు, ఇంటర్ ఫలితాల పంపిణీలో విజయవంతమయ్యాయి. ఇప్పుడు ఎస్ఎస్‌‌సీ ఫలితాలను కూడా చేర్చడం ద్వారా డిజిటల్ తెలంగాణ దిశగా మరో ముందడుగు పడింది. ఈ విధానం వల్ల విద్యార్థులు ఇంటి వద్ద నుంచే సులభంగా, పారదర్శకంగా తమ ఫలితాలను చూసుకోవచ్చు.