Let's talk: editor@tmv.in
తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో కాదు.. తరగతి గదుల్లో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో కాదు.. తరగతి గదుల్లో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ భవిష్యత్తు అద్దాల మేడల్లో కాదు.. తరగతి గదుల్లో ఉంది: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
18 జూన్, 2026

ప్రభుత్వ పాఠశాలలంటే కేవలం అనాధలు, ఆర్థికంగా వెనుకబడిన వారు మాత్రమే చదువుకుంటారనే పాత అభిప్రాయాన్ని సంపూర్ణంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే దృఢ సంకల్పంతో రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స‌ (టీపీఎస్) ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఇదే వేదికగా విద్యార్థుల కోసం ఉదయం అందించే ‘బ్రేక్ ఫాస్ట్’ పథకానికి కూడా సీఎం శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 27 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థులకు ఆరుట్ల పాఠశాల ఒక దిక్సూచిగా, రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల పట్ల సమాజంలో ఉన్న అపనమ్మకాలను పోగొట్టి, ఇక్కడ చదివినా డాక్టర్లు, కలెక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు కాగలరనే ఆత్మవిశ్వాసాన్ని కుటుంబాలలో నింపడమే తమ ప్రభుత్వ బృహత్తర లక్ష్యమని స్పష్టం చేశారు.

విధ్వంసమైన తెలంగాణ విద్యా విధానాన్ని వికాసం వైపు నడిపించేందుకు ఈ పాఠశాల అద్దం పడుతుందని సీఎం పేర్కొన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. విద్యపై పెట్టే ఖర్చును నేను భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తా. విద్య ద్వారానే అంటరానితనాన్ని, సామాజిక అసమానతలను నిర్మూలించవచ్చు అని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలోని రూ. 3 లక్షల కోట్లకు పైగా ఉన్న బడ్జెట్‌లో 8.50 శాతం పైగా, అంటే సుమారు రూ. 26 వేల కోట్ల రూపాయలను ఒక్క విద్యాశాఖకే కేటాయించినట్లు వెల్లడించారు. నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు 1,814 మంది విద్యార్థులతో ఈ పాఠశాలలో "అడ్మిషన్లు పూర్తయ్యాయి.. సీట్లు ఖాళీ లేవు" అని బోర్డు పెట్టే పరిస్థితి రావడం పట్ల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీని, ఉపాధ్యాయులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవిల స్మృత్యర్థం ఈ చారిత్రాత్మక గడ్డపై ఈ పాఠశాలను నిర్మించినట్లు సీఎం వివరించారు.

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు

ముఖ్యమంత్రితో సహా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి వంటి గొప్ప నాయకులు, అలాగే దేశంలోని ఎందరో మహానుభావులు ప్రభుత్వ బడుల్లో చదువుకున్నవారేనని, కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా చదువు ద్వారానే ఆత్మగౌరవం సిద్ధిస్తుందని సీఎం హితవు పలికారు. కులాలు, వర్గాల పేరిట వేర్వేరు పాఠశాలలు పెట్టి సమాజాన్ని విభజించే పాత పద్ధతికి స్వస్తి పలికేందుకే తాము 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను' నిర్మిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల కోసం రూ. 688 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్కూల్ కిట్లు (యూనిఫాం, షూస్, సాక్స్, బ్యాగులు, దుప్పట్లు) తయారు చేయిస్తున్నామని, వీటిని జూలై ఆఖరు నుంచి పంపిణీ చేస్తామని ప్రకటించారు.

నైపుణ్యాలు, క్రీడలు, డ్రగ్స్ రహిత సమాజం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న తరుణంలో, యువతకు ఉపాధి కల్పించేందుకు 'స్కిల్స్ యూనివర్సిటీ'ని ప్రారంభించామని, మొదటి ఏడాదే విద్యార్థులు ఉద్యోగాలు పొందడం సంతోషకరమన్నారు. ఒలింపిక్స్‌లో దేశం వెనుకబడటంపై ఆవేదన వ్యక్తం చేస్తూ, క్రీడలను ప్రోత్సహించేందుకు పబ్లిక్-ప్రైవేట్ మోడల్‌లో 'స్పోర్ట్స్ యూనివర్సిటీ'ని తెచ్చామని, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికే అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీని హైదరాబాద్ రప్పించామని గుర్తుచేశారు. చివరగా, సమాజానికి మహమ్మారిగా మారిన మాదక ద్రవ్యాల (డ్రగ్స్, గంజాయి) వాడకాన్ని నియంత్రించాలని, ఈ నెల 19న ఎల్బీ స్టేడియంలో గవర్నర్ సమక్షంలో వేలాది మంది విద్యార్థులతో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.