Let's talk: editor@tmv.in
ప్రజా పాలనతో సమానత్వ దిశగా తెలంగాణ: మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రజా పాలనతో సమానత్వ దిశగా తెలంగాణ: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
3 జూన్, 2026

తెలంగాణ అనేది కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదని, అది కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు వందనం చేస్తూ జిల్లా సాధించిన ప్రగతి నివేదికను ప్రజల ముందుంచారు.

కాళోజీ నారాయణరావు కలలు కన్న ప్రజా పాలనలో మరింత సమానత్వంతో రాష్ట్రం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ కింద 99 రోజుల కార్యాచరణ ద్వారా 3,506 ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లను పరిష్కరించామని, వైద్య శిబిరాలు, రోడ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు.

సిద్దిపేట జిల్లా సంక్షేమం

మహాలక్ష్మి పథకం:

జిల్లాలో 9 కోట్ల 24 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ. 358 కోట్ల లబ్ధి పొందారు. అలాగే, 1,79,883 మందికి రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తూ, రూ. 22.82 కోట్ల సబ్సిడీని నేరుగా ఖాతాల్లో జమ చేశాం.

రాజీవ్ ఆరోగ్యశ్రీ:

వైద్య పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిన తర్వాత, జిల్లాలో రూ. 166 కోట్లతో 61,094 మంది పేదలకు ఉచిత శస్త్రచికిత్సలు జరిగాయి.

రైతు సంక్షేమం:

రైతు భరోసా కింద 3.19 లక్షల మందికి రూ. 1,119 కోట్లు, పంట రుణమాఫీ ద్వారా 1.09 లక్షల మంది రైతులకు రూ. 908 కోట్లు మంజూరయ్యాయి. నంగునూరు మండలం నర్మేటలో రూ. 300 కోట్ల వ్యయంతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సీఎం ప్రారంభించారు.

ఇందిరమ్మ ఇండ్లు & గృహజ్యోతి:

10,898 ఇండ్లకు అనుమతులు ఇవ్వగా, రూ. 238.65 కోట్లు విడుదలయ్యాయి. గృహజ్యోతి కింద 2.05 లక్షల కుటుంబాలకు రూ. 163 కోట్ల విద్యుత్ సబ్సిడీ లభించింది.

ఇందిరా మహిళా శక్తి:

మహిళా సమాఖ్యల ఆదాయం కోసం రూ. 8.64 కోట్లతో 24 ఆర్టీసీ బస్సులను కొనుగోలు చేసి పంపిణీ చేశాం.

ఆసరా (చేయూత) పింఛన్లు:

జిల్లాలో 1,82,136 మంది లబ్ధిదారులకు ప్రతి నెల రూ. 39.40 కోట్లను పింఛన్లుగా అందజేస్తున్నాం.

మున్సిపాలిటీల అభివృద్ధి

పదో తరగతిలో జిల్లా 97.85 శాతం ఉత్తీర్ణత సాధించిందని, బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 16 కోట్లు విడుదల చేశామని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ మున్సిపాలిటీకి ఉత్తమ పర్యావరణ అవార్డు రావడం గర్వకారణమన్నారు. గజ్వేల్‌లో రూ. 2.56 కోట్లతో నూతన ఆర్టీసీ బస్టాండ్, దుబ్బాకలో రూ. 15 కోట్లతో డ్రైనేజీ, చిల్డ్రన్ పార్క్ పనులు జరుగుతున్నాయని తెలిపారు. జిల్లా అభివృద్ధికి సహకరించిన ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియాకు మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.