

తెలంగాణ ‘పది’ ఫలితాలు విడుదల.. 95.16 శాతం ఉత్తీర్ణత
తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 95.16 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది 5 లక్షల 28 వేలకు పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 94.07 శాతం ఉత్తీర్ణత పొందారు. ములుగు జిల్లాలో అత్యధికంగా 99.30 శాతం ఉత్తీర్ణత కాగా, హైదరాబాద్ జిల్లాలో అత్యల్పంగా 89.23 శాతం ఉత్తీర్ణత సాధించింది.
పదో తరగతి ఫలితాల్లో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు అసాధారణ ప్రతిభను కనబరిచాయి. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత 95.16 శాతం కాగా, బీసీ గురుకులాలు 98.99శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలిచాయి. ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు స్పందిస్తూ.. ఈ అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందించాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషిని కొనియాడాలని పేర్కొన్నారు.
మొత్తం 294 పాఠశాలల్లో 204 పాఠశాలలు 100 శాతం ఉత్తీర్ణత సాధించాయి. విద్యా నాణ్యతలో బీసీ గురుకులాలు స్థిరమైన ప్రతిభను చూపించాయి. ఈ విద్యా సంస్థల నుంచి 19,245 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 19,047 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 9,093 మంది బాలురు, 9,954 మంది బాలికలు ఉన్నారు. ఈ ఏడాది ఫలితాల్లో ఇద్దరు విద్యార్థినులు నితీషా, శ్రీనిధి అత్యధికంగా 588 మార్కులు సాధించారు. సాయి మనోజ్ రెడ్డి, లాస్య 587 మార్కులు సాధించి ప్రతిభ చాటారు. మొత్తం 60 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించగా, 364 మంది 570కి పైగా మార్కులు సాధించారు. అదేవిధంగా 1,061 మంది విద్యార్థులు 560కి పైగా మార్కులు పొందారు. 3,598 మంది విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించడం గమనార్హం.
బీసీ సంక్షేమ హాస్టళ్ల ప్రతిభ
గురుకులాలతో పాటు బీసీ సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ చదువుకున్న విద్యార్థులు కూడా 96.05 శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు. 365 హాస్టళ్ల నుంచి 4,941 మంది పరీక్ష రాయగా, 4,746 మంది పాసయ్యారు. ఇందులో 285 హాస్టళ్లు 100 శాతం ఫలితాలు సాధించాయి. అదిలాబాద్, హైదరాబాద్, ములుగు జిల్లాలు హాస్టల్ ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో నిలిచాయి. విద్యార్థుల ఘనవిజయం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాల మాయాదేవి, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బడుగు సైదులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు, ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు.
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
పదో తరగతి ఫలితాలు ప్రకటించిన కొద్ది గంటల్లోనే అధికారులు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. ఈ పరీక్షలు జూన్ 5 నుంచి 12 వరకు జరగనున్నాయి. ఫెయిలైన అభ్యర్థులు పరీక్ష ఫీజును సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించేందుకు మే 14, 2026 వరకు గడువు పొడిగించారు. రోజూ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
• జూన్ 5న ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఎ) పరీక్ష
• 6న సెకండ్ లాంగ్వేజ్
• 7న థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లిష్),
• 8న మ్యాథమెటిక్స్
• 9న సైన్స్ పార్ట్-1 (ఫిజికల్ సైన్స్),
• 10న సైన్స్ పార్ట్-2 (బయాలాజికల్ సైన్స్
• 11న సోషల్ స్టడీస్, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ పరీక్షలు
• అలాగే, 12వ తేదీన ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు డైరెక్టర్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
