
నేడు తెలంగాణ పాలిసెట్ ఫలితాల విడుదల
తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2026) రాసిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఐటీ శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నాయకత్వంలో, 'మీ సేవ' సరికొత్త పౌర కేంద్రీకృత సేవను అందుబాటులోకి తెచ్చింది. ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ విభాగం.. 'మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్' వేదిక ద్వారా నేరుగా అభ్యర్థుల మొబైల్‌కే ఫలితాలను పంపనుంది. ఈ ఫలితాలు నేడు (శనివారం 23-05-2026) ఉదయం 11:30 గంటల నుంచి విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. మే 13న రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
ఫలితాలు పొందే విధానం
• ఆటోమేటిక్ డెలివరీ: ఇది అవుట్‌బౌండ్ సేవ కావడం వల్ల అభ్యర్థులు ఫలితాల కోసం ప్రత్యేకంగా ఎలాంటి మెసేజ్ లేదా అభ్యర్థన చేయాల్సిన అవసరం లేదు.
• వాట్సాప్ నంబర్: అధికారిక మీ సేవ తెలంగాణ వాట్సాప్ నంబర్ (8096958096) ద్వారా ఈ ఫలితాలు నేరుగా అందుతాయి.
• పీడీఎఫ్ రూపంలో: పరీక్ష కోసం అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్‌కు ఫలితాల వివరాలు పీడీఎఫ్ రూపంలో ఆటోమేటిక్‌గా పంపబడతాయి.
విద్యార్థులు, తల్లిదండ్రులు వెబ్‌సైట్ల కోసం ఇబ్బంది పడకుండా, పరీక్ష ఫలితాలను వేగంగా, సురక్షితంగా, పారదర్శకంగా నేరుగా వారి చేతుల్లోని మొబైల్‌కే అందించేందుకు ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
