
పౌరుల భద్రతకు తెలంగాణ పోలీస్ కట్టుబడి ఉంది: బండి సంజయ్ వ్యాఖ్యలపై డీజీపీ వివరణ
తెలంగాణ రాష్ట్ర పౌరులందరికీ, ముఖ్యంగా వృత్తిరీత్యా ఇక్కడ నివసిస్తున్న వారికి సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణాన్ని కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యక్తం చేసిన ఆందోళనలపై స్పందిస్తూ డీజీపీ కార్యాలయం నుంచి ఈ వివరణ వెలువడింది.
హైదరాబాద్ నగర అభివృద్ధిలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది నిపుణుల పాత్ర ఎంతో ఉందని, భిన్నత్వంలో ఏకత్వమే ఈ నగర బలం అని డీజీపీ పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఇక్కడ సామరస్యంగా, ఆత్మగౌరవంతో జీవించేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. 'సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్స (ఎస్‌సీఎస్‌సీ) ద్వారా పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, హెచ్ఆర్ బృందాలతో కలిసి పని చేస్తూ కార్యాలయాల్లో భద్రతను పటిష్టం చేస్తున్నట్లు తెలిపారు.
పని చేసే మహిళల హాస్టళ్లు, పీజీ వసతి గృహాల్లో నిరంతరం భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం 'షీ షటిల్' సేవలు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు 'మార్గదర్శి' వంటి కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో మహిళా భద్రతా విభాగం, షీ టీమ్స్ భరోసా కేంద్రాలు అద్భుతంగా పని చేస్తున్నాయని, ప్రతి ఫిర్యాదుపై తక్షణమే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసులు రాజ్యాంగ విలువలకు కట్టుబడి, సమాజంలోని అన్ని వర్గాలతో కలిసి పని చేస్తూ శాంతిభద్రతలను కాపాడతారని డీజీపీ పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ను సురక్షితమైన ప్రపంచ స్థాయి నగరంగా ఉంచడంలో ఎటువంటి రాజీ పడబోమని ఆయన హామీ ఇచ్చారు.
మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఒక ఐటీ సంస్థ (ఎంఎన్ సీ)లో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, బలవంతపు మత మార్పిడి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన, తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డికి కీలక సూచనలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. నాసిక్ ఘటన తర్వాత తెలంగాణ ప్రభుత్వం మౌనంగా ఉండకూడదని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకముందే జాగ్రత్త పడాలని బండి సంజయ్ పేర్కొన్నారు.
