Let's talk: editor@tmv.in
ఏపీలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ బృందం పర్యటన

ఏపీలో తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ సలహా కమిటీ బృందం పర్యటన

Panthagani Anusha
22 మే, 2026

విదేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న కార్మికుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలు, రక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రవాస భారతీయుల (ఎన్ఆర్ఐ) సలహా కమిటీ ప్రతినిధి బృందం గురువారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించింది.

రెండు రాష్ట్రాల మధ్య ప్రవాస కార్మికుల సంక్షేమ విధానాల మార్పిడి పరస్పర సమన్వయమే లక్ష్యంగా సాగిన ఈ పర్యటన తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త మైత్రికి వేదికగా నిలిచింది. ఎన్ఆర్ఐలు, గల్ఫ్ వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని ఏపీ సీఐడీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎ. రవిశంకర్ ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణకు చెందిన 14 మంది సభ్యుల ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ, ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ కార్యాలయాలను సందర్శించింది. దీంతో పాటు ఏపీ సీఐడీ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ సెల్ కార్యాలయాన్ని కూడా సందర్శించి అక్కడ బాధితులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించింది. అనంతరం ప్రవాసాంధ్రుల వ్యవహారాల మంత్రి కె. శ్రీనివాస్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఈ బృందం ప్రత్యేకంగా సమావేశమైంది. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారికి తక్షణ సహాయక చర్యలు అందించడం, అత్యవసర సమయాల్లో రక్షణ ఆపరేషన్లు చేపట్టడం స్వదేశానికి సురక్షితంగా తరలించే విధానాలు బాధితుల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఏపీ సీఐడీ ఏర్పాటు చేసిన పటిష్టమైన వ్యవస్థలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహా కమిటీ ఛైర్మన్ బి.ఎం. వినోద్ కుమార్ నేతృత్వంలో సాగిన ఈ పర్యటనలో వైస్ చైర్మన్ మండా భీమ్ రెడ్డితో పాటు పలువురు కమిటీ సభ్యులు చురుగ్గా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున ఎన్ఆర్ఐ సెల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె.వి. శ్రీనివాసరావుతో పాటు సీఐడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొని విదేశాల్లో తెలుగు వలస కార్మికులు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, మోసాలు, వేతనాల చెల్లింపుల్లో సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

ఈ విస్తృత స్థాయి భేటీ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రవాస తెలుగు ప్రజల రక్షణ విషయంలో సమన్వయం మరింత బలోపేతం కానుందని సీఐడీ డీజీపీ రవిశంకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమ కార్యక్రమాల అమలులో ఏపీ ప్రభుత్వం పాటిస్తున్న అత్యుత్తమ విధానాల పరస్పర మార్పిడికి ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని, భవిష్యత్తులో ఇరు రాష్ట్రాలు కలిసికట్టుగా ప్రవాస కార్మికుల శ్రేయస్సుకై పనిచేస్తాయని ఆయన స్పష్టం చేశారు.