Let's talk: editor@tmv.in
కృష్ణా జలాలపై తెలంగాణ–కర్ణాటక చర్చలు.. సమన్వయంతో పరిష్కారం: మంత్రి ఉత్తమ్ కుమార్
కృష్ణా జలాలపై తెలంగాణ–కర్ణాటక చర్చలు.. సమన్వయంతో పరిష్కారం: మంత్రి ఉత్తమ్ కుమార్

కృష్ణా జలాలపై తెలంగాణ–కర్ణాటక చర్చలు.. సమన్వయంతో పరిష్కారం: మంత్రి ఉత్తమ్ కుమార్

Gaddamidi Naveen
26 మే, 2026

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వినియోగం, సాగు, తాగునీటి అవసరాలపై సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఉన్నత స్థాయి భేటీ జరిగింది. కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు.. తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, పరస్పర అవగాహనతో స్నేహాపూర్వక వాతావరణంలో ఈ చర్చలు జరిగాయి.

ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులు, త్రాగునీటి సరఫరా వ్యవస్థలు, కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు సమగ్రంగా చర్చించారు.

చర్చల అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు, సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రాజెక్టుల రూపకల్పన ఉండాలని స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై ఈ భేటీలో విస్తృతంగా చర్చించినట్లు వెల్లడించారు. అంతర్ రాష్ట్ర సమన్వయంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు రూపొందించిన ప్రతిపాదనలను కర్ణాటక మంత్రి ముందు ఉంచినట్లు తెలిపారు. ఈ చర్చలలో తెలంగాణ రైతాంగం సాగునీటి అవసరాలకు, భవిష్యత్తు అవసరాల పరిరక్షణకు తాము పూర్తి స్థాయిలో ప్రాధాన్యతనిచ్చామని మంత్రి వివరించారు. కృష్ణా జలాల సమన్యాయ వినియోగంపై రాష్ట్ర హక్కులను కాపాడుకుంటూనే, రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలు తీరేలా కలిసికట్టుగా చర్యలు తీసుకుంటామన్నారు.

ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం

నీటి వినియోగంపై ఉభయ రాష్ట్రాలకు సానుకూలంగా ఉండేలా త్వరలోనే ఒక అధికారిక ఒడంబడిక కుదుర్చుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంతర్ రాష్ట్ర చర్చల వివరాలను ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి సమగ్రంగా వివరించి, ఆ తర్వాతే సమిష్టిగా తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ సానుకూల చర్చల పట్ల ఇరు రాష్ట్రాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.