

ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణ అగ్రగామి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా, ఔషధ తయారీ రంగాలలో ప్రపంచానికే నాయకత్వం వహిస్తోందని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కొనియాడారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన దేశ, విదేశాల్లోని తెలంగాణ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, ఈ పవిత్రమైన రోజు కేవలం ఒక భౌగోళిక ప్రాంతం ఏర్పడిన పండుగ మాత్రమే కాదని, దశాబ్దాల ప్రజా ఉద్యమం, అమరవీరుల త్యాగం, ప్రజల ప్రజాస్వామ్య సంకల్పానికి దక్కిన విజయానికి ప్రతీక అని అభివర్ణించారు. భారతదేశంలోనే అత్యంత పిన్న వయస్కుడైన రాష్ట్రాల్లో ఒకటి అయినప్పటికీ, తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందని గవర్నర్ ప్రశంసించారు.
తెలంగాణ సాధించిన అభివృద్ధిని ప్రస్తావిస్తూ గవర్నర్ శుక్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఎదిగిన హైదరాబాద్.. నేడు అంతర్జాతీయ కార్పొరేట్ సంస్థలకు మొదటి ఛాయిస్‌గా మారిందని పేర్కొన్నారు. మెట్రో రైల్ నెట్‌వర్క్ విస్తరణ, ప్రతిష్టాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణం వంటివి రాష్ట్ర ఆధునిక దృక్పథానికి అద్దం పడుతున్నాయన్నారు. విభిన్న సంస్కృతుల ప్రజలు కలిసి జీవిస్తూ దేశాభివృద్ధికి దోహదపడుతున్న హైదరాబాద్ అత్యంత సురక్షితమైన, ప్రగతిశీల, సజీవమైన కాస్మోపాలిటన్ మెట్రో నగరమని కొనియాడారు. భారతదేశం నడిబొడ్డున ఉన్న తెలంగాణ భౌగోళిక స్థానం, దీనిని వ్యాపార, లాజిస్టిక్స్, పెట్టుబడులకు ప్రధాన ప్రవేశ ద్వారంగా మార్చిందని చెప్పారు.
లోక్ భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్ భవన్‌లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దశాబ్దాల ప్రజాస్వామ్య పోరాటం, ప్రాణ త్యాగాలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేసిన అమరవీరులకు ఆయన ఘన నివాళులర్పించారు.
