
బాల్య వివాహాల నిర్మూలనకు తెలంగాణ ప్రభుత్వం–తరుణి సంస్థ సంయుక్త కార్యాచరణ
రాష్ట్రంలో బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణలను పూర్తిగా అరికట్టేందుకు తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖ కీలక చర్యలు చేపట్టింది. బాలికల సాధికారత, బాల్య వివాహాల నిరోధం, మానవ అక్రమ రవాణా నివారణ వంటి అంశాల్లో రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్న తరుణి స్వచ్ఛంద సంస్థతో మహిళా, శిశు సంక్షేమ శాఖ సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, బాల్య వివాహం కేవలం కుటుంబ సమస్య కాదని, అది బాలికల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే సామాజిక సమస్య అని పేర్కొన్నారు. బాల్య వివాహాల కారణంగా బాలికలు చదువును మధ్యలోనే నిలిపివేయాల్సి వస్తోందని, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆర్థిక స్వావలంబన దెబ్బతింటోందని ఆందోళన వ్యక్తం చేశారు.‘బాల్య వివాహం – బతుకు ఆగం’ అనే నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రి తెలిపారు. ప్రతి బాలిక తన కలలను సాకారం చేసుకునేలా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సమాజం కలిసికట్టుగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఈ ఒప్పందం ద్వారా అంగన్‌వాడీ సిబ్బంది, సూపర్వైజర్లు, సీడీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు అందించనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి బాలికలకు వారి హక్కులు, ఆరోగ్యం, విద్య, భద్రతపై సమగ్ర సమాచారం అందించనున్నారు.
తరుణి సంస్థ ఫౌండర్ మమతా రఘువీర్ మాట్లాడుతూ, బాల్య వివాహాలు, మైనర్ గర్భధారణల నివారణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి సాంకేతిక సహకారం, శిక్షణలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సచివాలయంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఒఝా, తరుణి సంస్థ వ్యవస్థాపకులు మమతా రఘువీర్, రఘువీర్ తదితరులు పాల్గొన్నారు.
