
భూమి వివాదంపై రాజీకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం-ఎస్బీఐ
తెలంగాణ ప్రభుత్వానికి, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మధ్య నెలకొన్న భూవివాదానికి సఖ్యపూర్వక పరిష్కారం లభించింది. ఈ అంశంపై జూన్ 22న ప్రారంభమైన చర్చలకు కొనసాగింపుగా శనివారం మరోసారి ఇరుపక్షాల మధ్య సమావేశం జరిగింది.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఎస్బీఐ ప్రతినిధులతో సమావేశమై సమస్య పరిష్కారంపై చర్చించారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా సూచించిన భూములను జూన్ 23న ఎస్బీఐ అధికారులు పరిశీలించగా, ఆ ప్రతిపాదనలకు బ్యాంకు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
అయితే, ఈ నిర్ణయంపై తుది చర్యలు బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం అనంతరం చేపడతామని ఎస్బీఐ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం న్యాయస్థానంలో కొనసాగుతున్న కేసుకు అనుగుణంగా అవసరమైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. అన్ని చట్టబద్ధమైన ప్రక్రియలు పూర్తయిన వెంటనే ఈ అంశాన్ని త్వరితగతిన ముగించాలని ప్రభుత్వం, ఎస్బీఐ పరస్పర అంగీకారానికి వచ్చినట్లు విడుదలలో వెల్లడించారు.
అసలు వివాదం ఏమిటి?
హైదరాబాద్‌లోని రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఐదు ఎకరాల భూమి ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2010లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్బీఐ కార్పొరేట్ ప్రధాన కార్యాలయం నిర్మాణం కోసం ఈ స్థలాన్ని కేటాయించింది. అయితే, ఎస్బీఐ నిర్దేశిత కాలంలో అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు.
దీంతో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఇటీవల ఆ భూమిని వేలానికి పెట్టగా, ఎకరాకు రూ.200 కోట్లకు పైగా ధర పలికింది. దీనిని వ్యతిరేకిస్తూ ఎస్బీఐ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా, వేలం ప్రక్రియపై కోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలను ఎస్బీఐ నుంచి ఇతర బ్యాంకులకు మార్చే అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే, జూన్ 22 నుంచి ప్రారంభమైన చర్చలతో ఇరువర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగి, సమస్యకు పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారం దిశగా కీలక పురోగతి సాధించినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
