Let's talk: editor@tmv.in
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు

Gaddamidi Naveen
20 మే, 2026

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో చేపట్టబోయే వివిధ ప్రభుత్వ శాఖల్లో నేరుగా భర్తీ చేసే ఉద్యోగాల గరిష్ఠ వయోపరిమితిని మరో 10 సంవత్సరాల పాటు పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనివల్ల ప్రస్తుతమున్న గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరిగింది.

వివిధ నిరుద్యోగ సంఘాలు, అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సానుకూలంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 309 ప్రకారం గవర్నర్ ఆదేశాల మేరకు ఈ తాత్కాలిక నిబంధనను అమల్లోకి తెచ్చారు. ఈ వయోసడలింపు ఉత్తర్వులు జారీ అయిన నాటి నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటాయని, ఈ కాలంలో వెలువడే అన్ని రకాల ఉద్యోగ నోటిఫికేషన్లకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే శారీరక సామర్థ్యం, ప్రత్యేక రక్షణ నిబంధనలు ఉండే పోలీస్, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖ వంటి యూనిఫార్మ్ సర్వీసులకు ఈ వయోసడలింపు వర్తించదని ఉత్తర్వుల్లో పేర్కొంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) తో పాటు రాష్ట్రంలోని అన్ని ఇతర నియామక సంస్థలు ఈ నూతన నిబంధనను అమలు చేయనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల వయస్సు పైబడి అవకాశాలు కోల్పోతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు తిరిగి ప్రభుత్వ ఉద్యోగం సాధించే సువర్ణ అవకాశం లభించనుంది. గతంలో ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించారు. ఆ గడువు కూడా ముగియడంతో ప్రభుత్వం మరో ఏడాది పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.