
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించాలి: వికాస్ రాజ్
వచ్చే జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన ముందస్తు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రధాన వేడుకలను సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. వేడుకల రోజున ముఖ్యమంత్రి ముందుగా గన్ పార్క్ ను సందర్శించి, తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన అనంతరం పరేడ్ గ్రౌండ్స్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్, గన్‌పార్క్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించి సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్య అతిథులు ప్రయాణించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, పరేడ్ గ్రౌండ్‌కు వచ్చే వాహనాలకు ఇబ్బందులు లేకుండా పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.
వాటర్‌ప్రూఫ్ షామియానాలు, బారికేడింగ్ ఏర్పాట్లు చేయాలని ఆర్ అండ్ బీ శాఖకు సూచించారు. సభా ప్రాంగణం పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణతో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖకు సూచించారు. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ల ఏర్పాటు చేయడంతో పాటు అసెంబ్లీ, సచివాలయం, చార్మినార్, ప్రజాభవన్ తదితర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు.
వేడుకలను విస్తృతంగా ప్రజలకు చేరవేసేందుకు లైవ్ టెలికాస్ట్ ఏర్పాట్లు చేయాలని సమాచార శాఖను ఆదేశించారు. ఈ నెల 25 నుంచి పరేడ్ గ్రౌండ్‌లో అన్ని విభాగాలు సంయుక్త రిహార్సల్స్ నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
