

శ్రీనగర్‌లో ఖేలో ఇండియా ‘చింతన్ శివిర్’లో తెలంగాణ ప్రతినిధి బృందం
జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న ‘ఖేలో ఇండియా చింతన్ శివిర్’ లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి బృందం హాజరైంది. రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ఈ బృందంలో ప్రభుత్వ సలహాదారు ఏ.పి. జితేందర్ రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేన, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, స్పోర్ట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలా దేవి ఉన్నారు.
శ్రీనగర్‌లోని షేర్-ఇ-కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, రక్షణ శాఖ సహాయ మంత్రి నిఖిల్ ఖడ్సే సారథ్యంలో జరుగుతున్న ఈ శివిర్‌లో వివిధ రాష్ట్రాల క్రీడా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. దేశంలో క్రీడల అభివృద్ధి, కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం, భవిష్యత్తు వ్యూహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
తెలంగాణ క్రీడా విధానంపై ప్రసంగం
తెలంగాణను క్రీడా రంగంలో ఒక రోల్ మోడల్‌గా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి వాకిటి శ్రీహరి ఈ వేదికపై వివరించనున్నారు. రాష్ట్రంలోని క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, క్రీడాకారుల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత మద్దతు కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న పురోగామి క్రీడా విధానాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించనున్నారు.
యోగా సెషన్‌లో పాల్గొన్న మంత్రి
కార్యక్రమ తొలి రోజున మంత్రి వాకిటి శ్రీహరి, కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయతో కలిసి యోగా సెషన్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా శారీరక దృఢత్వాన్నే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుందని, పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీనిని ఒక బాధ్యతగా స్వీకరించాలని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల మంత్రులు, కోచ్‌లు, అథ్లెట్లు, క్రీడా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు తమ సలహాలను పంచుకుంటున్నారు.
