

తెలంగాణ కులగణన నివేదిక విడుదల
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో నిర్వహించిన సమగ్ర కులగణన సర్వేపై నిపుణుల బృందం చేసిన విశ్లేషణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణ సామాజిక-ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ఆధారంగా ఈ నివేదిక తయారైంది. ప్రభుత్వం ఈ సర్వే ఫలితాలను బుధవారం రాత్రి విడుదల చేసింది.
రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో 135 కులాలు సగటు కంటే ఎక్కువ వెనుకబాటుతనంలో ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ విశ్లేషణను జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన, ప్రొఫెసర్ కంచె ఐలయ్య ఉపాధ్యక్షులుగా, తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటైన నిపుణుల కమిటీ రూపొందించినది.
వెనుకబాటుతనంపై కమిటీ కీలక విశ్లేషణ
తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 242 కులాల్లో 135 కులాలు రాష్ట్ర సగటు వెనుకబాటుతనం కంటే ఎక్కువ వెనుకబడి ఉన్నాయని నిపుణుల కమిటీ గుర్తించింది. ఈ 135 కులాలు రాష్ట్ర మొత్తం జనాభాలో 67 శాతం మందిని కలిగి ఉన్నాయి. రాష్ట్ర సగటు 'సమగ్ర వెనుకబాటు సూచిక' స్కోరు 81గా తేలింది. ఈ స్కోరు ఎంత ఎక్కువగా ఉంటే ఆ కులం అంత వెనుకబడినట్లు లెక్క. ఈ ప్రాతిపదికన మెజారిటీ కులాలు ఇంకా అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నాయని నివేదిక స్పష్టం చేసింది.
వర్గాల వారీగా అంతరాలు
సాధారణ కులాలతో పోలిస్తే షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ ) మూడు రెట్లు ఎక్కువ వెనుకబడి ఉన్నాయని నివేదిక వెల్లడించింది. అలాగే వెనుకబడిన తరగతులు (బీసీ), సాధారణ కులాల కంటే 2.7 రెట్లు వెనుకబడి ఉన్నాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక అసమానతలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి.
అత్యంత వెనుకబడిన 135 కులాలు
రాష్ట్ర సగటు స్కోరు 81 కంటే ఎక్కువ వెనుకబడి ఉన్న 135 కులాల్లో.. 69 బీసీ కులాలు, 41 ఎస్సీ కులాలు, 25 ఎస్టీ కులాలు ఉన్నాయి. అంటే రాష్ట్రంలోని నిరుపేద, అణగారిన వర్గాల్లో అత్యధిక శాతం మందికి ఇంకా ప్రభుత్వ ఫలాలు పూర్తిస్థాయిలో అందలేదని కమిటీ అభిప్రాయపడింది. ప్రతి వెనుకబడిన కులం సమానంగా వెనుకబడి లేదని, వాటిలో కూడా తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని నివేదికలోని ప్రధాన అంశం. ఇది సామాజిక, ఆర్థిక, విద్య ఉపాధి రంగాల్లో ఉన్న అసమానతలను స్పష్టంగా చూపుతోంది.
సాధారణ కులాల పరిస్థితి
రాష్ట్రంలో ఉన్న 18 రకాల సాధారణ కులాలు అన్నింటిలోనూ వెనుకబాటుతనం సూచిక రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. అంటే ఇవి ఆర్థికంగా, సామాజికంగా కొంత మెరుగైన స్థితిలో ఉన్నాయని అర్థం. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న ఈ వర్గాలు, వెనుకబాటుతనం విషయంలో సురక్షితమైన స్థానంలో ఉన్నట్లు కమిటీ పేర్కొంది. వీరిలో ఎవరూ కూడా అత్యంత వెనుకబడిన వర్గాల జాబితాలోకి రాలేదు.
రాష్ట్ర సగటు కంటే తక్కువ వెనుకబాటుతనం కలిగిన కులాలు 107 ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వీటిలో 18 సాధారణ కులాలు, 64 బీసీ కులాలు, 18 ఎస్సీ కులాలు, 7 ఎస్టీ కులాలు ఉన్నాయి. ఈ 107 కులాలు రాష్ట్ర జనాభాలో 29 శాతం మందిని కలిగి ఉన్నాయి. వెనుకబడిన తరగతుల్లో కూడా కొన్ని కులాలు సాపేక్షంగా మెరుగైన స్థితిలో ఉన్నాయని, దీనిని బట్టి రిజర్వేషన్ల వర్గీకరణ లేదా ప్రయోజనాల పంపిణీలో స్పష్టత అవసరమని నివేదిక సూచిస్తోంది.
కనీస సౌకర్యాలులేని ఎస్సీ, ఎస్టీలు
ఈ నివేదిక రాష్ట్రంలోని వివిధ సామాజిక వర్గాల మధ్య ఉన్న మౌలిక సదుపాయాల అంతరాలను కూడా స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు వంటి కనీస అవసరాల విషయంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఈ గణాంకాలు ఎత్తిచూపుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13.3 శాతం గృహాలకు ఇప్పటికీ సొంత మరుగుదొడ్డి సౌకర్యం లేకపోవడం గమనార్హం. ఈ సమస్య ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది, అక్కడ 32.5 శాతం ఎస్టీ కుటుంబాలు మరుగుదొడ్లు లేకుండానే జీవనం సాగిస్తున్నాయి. ఎస్సీల్లో ఈ శాతం 18.8 గా ఉండగా, అగ్రవర్ణాల్లో కేవలం 4.5 శాతం మందికి మాత్రమే ఈ సౌకర్యం లేదని నివేదిక వెల్లడించింది.
స్వచ్ఛ భారత్ మిషన్ కింద అనేక గ్రామాలు 'ఓడిఎఫ్ ప్లస్' హోదా పొందినప్పటికీ, క్షేత్రస్థాయిలో వ్యక్తిగత మరుగుదొడ్ల వినియోగం, అందుబాటులో ఇంకా భారీ వ్యత్యాసాలు ఉన్నాయని ఈ సమాచారం స్పష్టం చేస్తోంది.
మౌలిక సదుపాయాలైన విద్యుత్ తాగునీటి సరఫరాలో కూడా సామాజిక అసమానతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం గృహాలలో సుమారు 5.8 శాతం (6.56 లక్షలు) కుటుంబాలకు నేటికీ విద్యుత్ సౌకర్యం అందుబాటులో లేదు. వర్గాల వారీగా చూస్తే, ఎస్టీ కుటుంబాల్లో 11 శాతం, ఎస్సీల్లో 8.3 శాతం మంది చీకట్లోనే మగ్గుతుండగా, ఓసీల్లో ఈ శాతం కేవలం 2.7 గా ఉంది.
అదేవిధంగా, తాగునీటి కనెక్షన్ల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా 21.2 శాతం గృహాలకు కుళాయి నీటి సౌకర్యం లేదు. ఎస్సీల్లో 19.7 శాతం, ఎస్టీల్లో 21 శాతం మరియు బీసీల్లో 20 శాతం కుటుంబాలు పైపుల ద్వారా వచ్చే నీటికి దూరంగా ఉండగా, అగ్రవర్ణాల్లో ఆ సంఖ్య 12.8 శాతానికి పరిమితమైంది. ఈ గణాంకాలు అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు సమానంగా అందడం లేదని, ముఖ్యంగా అణగారిన వర్గాల నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నాయి.
ఆర్థిక స్థితిగతులు, జీవన ప్రమాణాలను ప్రతిబింబించే ఆస్తుల వినియోగంలోనూ భారీ తేడాలు ఉన్నట్లు సర్వే గుర్తించింది. ముఖ్యంగా కారు వంటి విలాసవంతమైన వాహనాల యాజమాన్యాన్ని పరిశీలిస్తే, అగ్రవర్ణాల కుటుంబాలతో పోలిస్తే బీసీలు మూడు రెట్లు, ఎస్సీ, ఎస్టీలు ఐదు రెట్లు వెనుకబడి ఉన్నారు. సుమారు 3.55 కోట్ల మంది ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను 75 రకాల అంశాల ఆధారంగా సేకరించిన ఈ 'కుల గణన', తెలంగాణ సమాజం ప్రస్తుత ఆరోగ్య పరిస్థితికి అద్దం పడుతోంది. కేవలం గణాంకాలుగానే కాకుండా, ప్రజల ఆశలు, అనుభవాలు, సామాజిక వెనుకబాటుతనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ నివేదిక ఒక కీలక ఆధారంగా నిలుస్తుంది. భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పనలో, వనరుల పంపిణీలో ఈ వివక్షను తొలగించి, సమానత్వాన్ని సాధించడానికి ఈ సర్వే డేటా అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2024 ఫిబ్రవరిలో క్యాబినెట్, శాసనసభ ఏకగ్రీవ తీర్మానాలతో ప్రారంభమైన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్యా, కుల గణన ప్రక్రియ అత్యంత విజయవంతంగా పూర్తయింది. కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నమూనాలను అధ్యయనం చేసి, మేధావులు, వివిధ పార్టీల సంప్రదింపులతో రూపొందించిన ఈ సర్వేలో ప్రణాళికా శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరించగా, సుమారు 1.03 లక్షల మంది ఎన్యుమరేటర్ల సహాయంతో రాష్ట్రవ్యాప్తంగా 1,12,36,849 కుటుంబాలకు (97.10శాతం) చెందిన 3,55,50,759 మంది జనాభా వివరాలను సేకరించారు. సమాజంలోని వివిధ వర్గాల స్థితిగతులను అంచనా వేసి వారికి తగిన విద్యా, ఉపాధి, రాజకీయ అవకాశాలను కల్పించే ప్రణాళికల రూపకల్పనకు ఈ గణాంకాలు కీలక ఆధారం కానున్నాయి.
తెలంగాణ కుల గణన సర్వేలో భాగంగా కులం, విద్య, ఉపాధి, రాజకీయ భాగస్వామ్యం వంటి 57 అంశాలపై సమగ్ర సమాచారం సేకరించగా, ఈ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో బీసీలు 56.36శాతం, ఎస్సీలు 17.42శాతం, ఎస్టీలు 10.43శాతం, ఓసీలు 15.79శాతం ఉండగా, సుమారు 14 లక్షల మంది (4శాతం) విద్యావంతులు 'నో కాస్ట్' ఐచ్ఛికాన్ని ఎంచుకోవడం గమనార్హం. 42 పారామీటర్లతో రూపొందించిన సమగ్ర వెనుకబాటుతనం సూచిక ప్రకారం 96 పాయింట్లతో ఎస్సీలు, 95 పాయింట్లతో ఎస్టీలు అత్యంత వెనుకబడి ఉండగా, బీసీల సగటు స్కోరు 86గా, ఓసీల స్కోరు 31గా నమోదైంది. ఈ నివేదిక తెలంగాణలో కులాల మధ్య ఉన్న అసమానతలను స్పష్టంగా బయటపెట్టింది. అధికారికంగా ప్రభుత్వం బహిర్గతం చేసిన ఈ నివేదిక భవిష్యత్తులో సంక్షేమ పథకాల రూపకల్పనకు, రిజర్వేషన్ల అమలుకు దిక్సూచిగా మారనుంది.
కాగా, నివేదికను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వం 2024లో ప్రకటించిన విధంగానే ఇంటింటికీ వెళ్లి కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని, ఆ సమగ్ర నివేదికను ఇప్పుడు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ బహిర్గతం చేసిన ఈ నివేదిక, భవిష్యత్తులో దేశం మొత్తానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆయన ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి ఇంటికి వెళ్లి 97.10 శాతం సమగ్ర సర్వే పూర్తి చేశాం. సెల్ఫ్ డిక్లరేషన్ పకడ్బందీగా చేశాం. లక్ష 3 వేల ప్రభుత్వ సిబ్బందితో పారదర్శకంగా సర్వే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే దేశానికి రోల్ మెడల్‌గా నిలిచింది. మా ప్రభుత్వం చేసిన సర్వే డేటాను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
