Let's talk: editor@tmv.in
తెలంగాణ కుల గణన: అయ్యర్లు, క్రైస్తవులలోనే అత్యధిక కులాంతర వివాహాలు

తెలంగాణ కుల గణన: అయ్యర్లు, క్రైస్తవులలోనే అత్యధిక కులాంతర వివాహాలు

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25లో నిర్వహించిన సమగ్ర ఇంటింటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే నివేదికలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చాయి. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల బృందం ఈ గణాంకాలను విశ్లేషించి, రాష్ట్రంలో కులాంతర వివాహాల సరళిపై కీలక నివేదికను సమర్పించింది.

సామాజిక అడ్డంకులు సడలడం, వ్యక్తిగత స్వేచ్ఛ పెరగడం వంటి అంశాలను కులాంతర వివాహాలు ప్రతిబింబిస్తాయని నిపుణుల బృందం పేర్కొంది. ముఖ్యంగా మహిళలు తమ భాగస్వాములను ఎంచుకోవడంలో చూపుతున్న స్వతంత్రతకు ఇది సంకేతమని విశ్లేషించింది.

రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకున్న కుటుంబాల్లో అయ్యంగార్లు/అయ్యర్లు (12 శాతం) అగ్రస్థానంలో ఉండగా, వారి తర్వాత బీసీ/ఎస్సీ క్రైస్తవులు 9.9 శాతం, రాజులు 8.7 శాతంగా ఉన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గంలో 90 శాతానికి పైగా ప్రజలు పట్టణాల్లో నివసించడం వల్ల కుల ఆధారిత వివాహ పరిమితులు కొంత సడలుతున్నాయని నివేదిక వెల్లడించింది. అధిక విద్య, పట్టణీకరణ ఆధునిక జీవనశైలి కారణంగా వీరిలో సాంప్రదాయ వివాహ నిబంధనలు సడలుతున్నట్లు నిపుణులు గుర్తించారు. బీసీ-ఏ గంగిరెడ్లవారు, అగ్నికులక్షత్రియలు, అలాగే కాపులు, బ్రాహ్మణులలో కూడా కులాంతర వివాహాల శాతం ఎక్కువగా ఉంది.

సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉండి, భూస్వామ్య నేపథ్యం ఉన్న రెడ్డి, వెలమ సామాజిక వర్గాల్లో కులాంతర వివాహాల రేటు రాష్ట్ర సగటు కంటే చాలా తక్కువగా ఉంది. ఈ వర్గాల్లో ఇప్పటికీ కుల ప్రాతిపదికన జరిగే వివాహాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని, ముఖ్యంగా మహిళల వివాహ నిర్ణయాల్లో వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువగా ఉండటం దీనికి కారణమని నివేదిక అభిప్రాయపడింది.

భౌగోళికంగా దూరంగా ఉండటం, సాంప్రదాయ నిబంధనలను కఠినంగా పాటించడం వల్ల ఎస్టీ కోలాం 2.6 శాతం, బీసీ-డి మాలి 2.6 శాతం, ఎస్టీ గోండు 2.8 శాతం తెగల్లో కులాంతర వివాహాలు అత్యంత తక్కువగా నమోదయ్యాయి. ఆర్థిక ప్రగతి, పట్టణీకరణ కొన్ని వర్గాల్లో మార్పు తెచ్చినప్పటికీ, తెలంగాణ సమాజంలోని మెజారిటీ వర్గాల్లో కుల మూలాలు ఇప్పటికీ వివాహ బంధాలను శాసిస్తున్నాయని నిపుణుల బృందం తేల్చింది. ఏప్రిల్ 15న ఈ సర్వే నివేదికలను ప్రభుత్వం బహిరంగపరిచింది.