Let's talk: editor@tmv.in
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం: విద్యార్థులతో పాటు టీచర్లకూ ఉచిత భోజనం

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం: విద్యార్థులతో పాటు టీచర్లకూ ఉచిత భోజనం

Dantu Vijaya Lakshmi Prasanna
3 జులై, 2026

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతులు, మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి వంటి పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు కూడా భోజన పథకం

ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకాన్ని రాష్ట్రంలోని సుమారు 1.50 లక్షల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా వర్తింపజేయాలని నిర్ణయించింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒకే వేదికపై భోజనం చేయడం ద్వారా పాఠశాలల్లో సమానత్వం, సామాజిక అనుబంధం మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వీబీజీ రామ్‌జీ పథకంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో పథకంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ అంశంపై గతంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు మంత్రులు వెల్లడించారు.

ఉపాధి హామీ కూలీల ప్రయోజనాల కోసమే అమలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త పథకం నిరుపేదల హక్కులను దెబ్బతీసే విధంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ అంశంపై తెలంగాణ శాసనసభ ఇప్పటికే ఏకగ్రీవ తీర్మానం చేసినప్పటికీ కేంద్రం మార్పులు చేయకపోవడం విచారకరమని పేర్కొంది. అయితే ఉపాధి హామీ కూలీలకు నష్టం జరగకుండా ఉండేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని అమలు చేయాల్సి వస్తోందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 6,278 ఉద్యోగాలు

రాష్ట్రంలో కొత్తగా అందుబాటులోకి వస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్ టిమ్స్ ఆసుపత్రులతో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలను బలోపేతం చేయడానికి 6,278 పోస్టులను మంజూరు చేసింది.

డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టిమ్స్ ఆసుపత్రులను భవిష్యత్తులో నిమ్స్ తరహా అత్యాధునిక వైద్య సంస్థలుగా అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే ఈ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పేద రోగులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా లెటర్స్ ఆఫ్ క్రెడిట్ జారీ చేసి ఆర్థిక భారం తగ్గించేలా చర్యలు చేపట్టనుంది.

మూసీ రివర్‌ఫ్రంట్‌కు రూ.7,345 కోట్ల ఆమోదం

హైదరాబాద్ నగర ప్రతిష్ఠాత్మక మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ఫేజ్–1 పనులకు మంత్రివర్గం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ దశలో గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రూ.7,345 కోట్లను మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండర్ ప్రక్రియ ప్రారంభించి పనులను వేగవంతం చేస్తామని మంత్రులు తెలిపారు.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వివరించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు
TelanganaCabinetRevanthReddyTelanganaGovernmentGovernmentSchoolsMidDayMealSchoolBreakfastTeachersWelfareEducationReformsTelanganaEducationJuniorCollegesTIMSHospitalsHealthcareJobsMedicalRecruitmentMusiRiverfrontHyderabadDevelopmentInfrastructureProjectsVBGRAMGMGNREGATelanganaNewsBreakingNews
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం: విద్యార్థులతో పాటు టీచర్లకూ ఉచిత భోజనం - Tholi Paluku