Let's talk: editor@tmv.in
రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం

Gaddamidi Naveen
20 మే, 2026

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) 33వ సమావేశం రేపు మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

సమావేశ ఎజెండా అంశాలను, వాటి తెలుగు అనువాదాన్ని మంగళవారం సాయంత్రం 6 గంటల లోపు సాధారణ పరిపాలన శాఖకు పంపాలని సీఎస్ స్పష్టం చేశారు. చర్చించాల్సిన ఎజెండా ఏమీ లేకపోయినా.. ఆ వివరాలతో కూడిన ‘నిల్’ నివేదికను కూడా నిర్దేశిత గడువులోగా తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. కేబినెట్ సమావేశం రోజు సంబంధిత ఉన్నతాధికారులు అందరూ ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆయ‌న పేర్కొన్నారు. సమావేశ ఏర్పాట్లకు సంబంధించి ప్రోటోకాల్, హార్టికల్చర్, టీజీటీఎస్ యూనిట్, అనువాద విభాగం తదితర శాఖలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్రంలోని పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.

రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం - Tholi Paluku