Let's talk: editor@tmv.in
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

Gaddamidi Naveen
22 ఏప్రిల్, 2026

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 23న (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం వేదికగా జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేసిన అధికారిక నోట్ ప్రకారం, ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై చర్చించనున్నారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు ఇతర సాంకేతిక అంశాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన నియోజకవర్గాల పునర్విభజన అంశం ఈ సమావేశంలో అత్యంత కీలకం కానుంది. లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖరారు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులు చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, అభివృద్ధి పథకాల అమలుతో పాటు రాజకీయ వ్యూహాల పరంగా ఈ కేబినెట్ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.