Let's talk: editor@tmv.in
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం

Gaddamidi Naveen
2 జులై, 2026

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ (కేబినెట్) సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరగబోయే ఈ 34వ మంత్రివర్గ సమావేశం.. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరో అంతస్తులో ఉన్న కేబినెట్ మీటింగ్ హాల్‌లో మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జూన్ 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేబినెట్ సమావేశానికి సంబంధించిన ఎజెండా అంశాలను, వాటి తెలుగు అనువాదంతో కలిపి జూలై 1వ తేదీ మధ్యాహ్నం 1.00 గంటల లోపు జనరల్ అడ్మినిస్ట్రేషన్ (కేబినెట్) విభాగానికి సమర్పించాలని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులను సిఎస్ ఆదేశించారు. ఎజెండా అంశాలు ఏవీ లేని పక్షంలో 'నిల్' నివేదికను పంపాలన్నారు. అలాగే, సమావేశం జరిగే సమయంలో కార్యదర్శులందరూ తప్పనిసరిగా ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో వీబీ జీ రామ్ జీ పథకంపై కేబినెట్ లో చర్చించనున్నారు. వీబీజీ రామ్ జీ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసేది లేదని మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లాలా? ఇతర రాష్ట్రాలతో కలిసి చేపట్టాల్సిన కార్యచరణ ఎలా ఉండాలనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్రం ప్రతిపాదించిన 60:40 నిధుల భాగస్వామ్య విధానం వల్ల తెలంగాణపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. రైతులు నష్టపోకుండా రాష్ట్రంలో ప్రత్యేకంగా గ్రామీణ ఉపాధి హామి చట్టం చేయాలన్న ఆలోచనలపై కేబినెట్ చర్చించనుంది.

వానాకాలం సాగుపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. విత్తనాలు, ఎరువుల పంపిణీ, పంటల వైవిధ్యం, ఎల్ నినో పరిస్థితులపై చర్చించి అధికారులను తగిన ఆదేశాలు ఇవ్వడంతో పాటు.. యాదాద్రి దేవస్థానం అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టులకు పరిపాలనా అనుమతులు, కొత్త సంక్షేమ పథకాల అమలు పురోగతి, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్‌లు
TelanganaTelanganaCabinetCabinetMeetingHyderabadRevanthReddyTelanganaGovernmentBreakingNewsLatestNewsPoliticsGovernancePublicPolicy
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం - Tholi Paluku