
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం
తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి (కేబినెట్) 33వ సమావేశం నేడు సాయంత్రం 4గంటలకు జరగనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తొలుత ఈ నెల 21వ తేదీన మంత్రివర్గ సమావేశం అని భావించినప్పటికీ 23వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 21న సరస్వతి అంత్య పుష్కరాల కారణంగా 23కు మంత్రివర్గ సమావేశం వాయిదా వేసినట్లు అధికారికవర్గాలు వెల్లడించాయి. ఈ కేబినెట్ భేటీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా విధివిధానాల ఖరారు చేయనున్నారు. జూన్ 2న, కొత్త పింఛన్లు, ఇందిరమ్మ రెండో విడత ఇళ్ల స్కీం ప్రారంభంపై నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రంలోని పలు కీలక నిర్ణయాలు, తాజా రాజకీయ, పరిపాలనాపరమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.
