
నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని ఆరో అంతస్తులో గల కేబినెట్ హాల్‌లో మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ 32వ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై కీలక అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణపై సమీక్ష జరగనుంది. ప్రాజెక్టులో అవసరమైన సాంకేతిక మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగమైన తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలుపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో అమలవుతున్న ఆరు గ్యారెంటీ పథకాల పురోగతి, వాటి అమలులో ఉన్న పరిస్థితులపై కూడా కేబినెట్ సమీక్షించనుంది. రాబోయే వానాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, సాగు ఏర్పాట్లపై నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.
ఇక గచ్చిబౌలి స్టేడియం అభివృద్ధి, రాష్ట్రంలోని నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశముంది. పరిపాలనా పరంగా కొన్ని కీలక నియామకాలు, అభివృద్ధి ప్రణాళికలపై కూడా మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సహా పలు అంశాలపై ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని కూడా సమీక్షించనున్నారు. మొత్తంగా, నేటి మంత్రివర్గ సమావేశం రాష్ట్ర అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయ ప్రణాళికలు, ఉద్యోగుల సంక్షేమం వంటి పలు కీలక అంశాలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
