Let's talk: editor@tmv.in
రైతుల సమస్యలపై గవర్నర్‌కు తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఫిర్యాదు

రైతుల సమస్యలపై గవర్నర్‌కు తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఫిర్యాదు

Gaddamidi Naveen
18 జూన్, 2026

తెలంగాణలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనప్పటికీ.. రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెలంగాణ బీజేపీ కిసాన్ మోర్చా ఆరోపించింది. ఈ మేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య నేతృత్వంలోని ఒక ప్రతినిధి బృందం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాని కలిసి వినతిపత్రం సమర్పించింది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలపై గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.

తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరుతూ కిసాన్ మోర్చా ప్రతినిధులు గవర్నర్ ముందు ప్రధాన డిమాండ్లను ఉంచారు. ప్రస్తుత సీజన్‌కు సంబంధించి తక్షణమే ఒక 'సమగ్ర వ్యవసాయ ప్రణాళికను' ప్రకటించాలి. నిలిచిపోయిన, పెండింగ్‌లో ఉన్న 'రైతు భరోసా' ఆర్థిక సాయం బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అన్నదాతలను ముంచుతున్న నకిలీ విత్తన మాఫియాపై కఠినమైన పీడీ యాక్ట్ ప్రయోగించాలి. వరి పంట సాగుపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను తక్షణమే ఎత్తివేయాలని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వ 'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన' పథకాన్ని ఈ ఖరీఫ్ సీజన్ నుంచే రాష్ట్రంలో పక్కాగా అమలు చేయాలన్నారు. సాగు చేస్తున్న కౌలు రైతుల హక్కులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులకిచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బస్వా లక్ష్మీ నర్సయ్య డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే, అన్నదాతల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, ప్రజా పోరాటాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రతినిధి బృందం హెచ్చరించింది.