

గ్లోబల్ ఏరోస్పేస్ హబ్‌గా తెలంగాణ: మంత్రి శ్రీధర్ బాబు
భవిష్యత్ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశంలోనే అత్యంత వ్యూహాత్మక ఏరోస్పేస్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధమైన చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌లో 'ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా' నిర్వహించిన జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏరోస్పేస్ రంగంలో అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీధర్ బాబు నొక్కి చెప్పారు. పరిశోధన, అభివృద్ధి, అధునాతన తయారీ రంగం, సర్టిఫికేషన్ ప్రక్రియలను సమన్వయం చేసే ప్రాంతాలే ప్రపంచ నాయకులుగా ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశంలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, పరిశోధనల్లో 30 శాతం కంటే తక్కువే వాణిజ్య పరంగా తయారీ రంగంలోకి మారుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంతరాన్ని తగ్గించి, పరిశోధనలను మార్కెట్ ఉత్పత్తులుగా మార్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ప్రపంచ ఏరోస్పేస్ సంస్థల సీఈఓలలో 74 శాతం మంది తక్కువ ధర కంటే నాణ్యమైన సరఫరా గొలుసుకే ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 42,000 కొత్త విమానాల అవసరం ఉంటుందని బోయింగ్, ఎయిర్‌బస్ నివేదికలు చెబుతున్నాయని, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి హైదరాబాద్ సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. విదేశీ సౌకర్యాలపై ఆధారపడటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడమే కాకుండా 18 నుంచి 24 నెలల జాప్యం జరుగుతోందని, అందుకే హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి టెస్టింగ్, సర్టిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్రం మద్దతు ఇవ్వాలని కోరారు. డ్రోన్లు, పునర్వినియోగ రాకెట్లు, ఏఐ ఆధారిత ఏవియానిక్స్, 3డీ ప్రింటింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై తెలంగాణ ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వెల్లడించారు.
మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్
హైదరాబాద్‌లోని 1,500 కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈ సంస్థలు ఇప్పటికే అంతర్జాతీయ ఏరోస్పేస్ దిగ్గజాలకు విడిభాగాలను సరఫరా చేస్తున్నాయని, ఇది 'మేడ్ ఇన్ తెలంగాణ' బ్రాండ్‌ను ప్రపంచస్థాయిలో నిలబెడుతోందని మంత్రి ప్రశంసించారు. ఏరోస్పేస్ పార్కులు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత వల్ల తెలంగాణ గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. సారస్వత్, సీఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్. కలైసెల్వి, ప్రముఖ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
లోక్‌సభలో సమాన ప్రాతినిధ్యం కోరడం నేరమా?: కేంద్రంపై ఫైర్
అనంతరం మీడియాతో లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సమానమైన రాజకీయ ప్రాతినిధ్యం కోరడం నేరమా అని ప్రశ్నిస్తూ, దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేలా సీట్ల పెంపు ఉండకూడదని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనపై వ్యక్తమవుతున్న ఆందోళనలను కేంద్రం తప్పుగా చిత్రీకరిస్తోందని మంత్రి మండిపడ్డారు. ఇది కేవలం రాజకీయ డిమాండ్ కాదని, రాష్ట్రాలకు ఉన్న రాజ్యాంగబద్ధమైన హక్కు అని ఆయన తెలిపారు.
పెద్ద రాష్ట్రాల్లో 85 నుంచి 100 వరకు ఉన్న సీట్లు పునర్విభజన తర్వాత 170కి పెరిగితే, అది జాతీయ రాజకీయాల్లో ప్రజాస్వామ్య సమతుల్యతను దెబ్బతీస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం సీట్ల సంఖ్యను రెట్టింపు చేయడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఒరిగేదేమీ లేదని, ఇది రాజకీయ అన్యాయమని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రజల్లో ఉన్న భయాందోళనలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. జనాభా నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు బహుమతి ఇవ్వాల్సింది పోయి, రాజకీయంగా శిక్షించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
