Let's talk: editor@tmv.in
తేజస్వీ సూర్య వ్యాఖ్యలు.. పార్లమెంట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన

తేజస్వీ సూర్య వ్యాఖ్యలు.. పార్లమెంట్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నిరసన

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

లోక్‌సభలో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చడాన్ని నిరసిస్తూ శుక్రవారం పార్లమెంట్ వెలుపల తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు భారీ ఆందోళన చేపట్టారు. తమ ప్రాంత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు తేజస్వీ సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. గురువారం లోక్‌సభలో నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన చర్చలో బెంగళూరు సౌత్ ఎంపీ తేజస్వీ సూర్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించిన తీరు, భారత్‌ - పాకిస్థాన్‌ విభజించిన దానికంటే దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ నేతల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి.

ముఖ్య నేతల స్పందన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తెలంగాణ అస్తిత్వంపై బీజేపీకి గౌరవం లేదని ఈ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి. రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చడం అత్యంత మూర్ఖత్వం, అహంకారం అని మండిపడ్డారు. అమరవీరుల త్యాగాలను బీజేపీ నేతలు అవమానిస్తున్నారని, ప్రధాని మోడీ నుంచి తేజస్వీ సూర్య వరకు అందరూ తెలంగాణ వ్యతిరేక ధోరణిని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆరోపించారు.

బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటులో చట్టబద్ధంగా ఏర్పడిన తెలంగాణను, దేశ విభజనతో పోల్చడం ద్వారా తేజస్వీ రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

2026లో జరగబోయే పునర్విభజనను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెబుతూనే, గతంలో జరిగిన విభజనను తేజస్వీ తప్పుబట్టారు. అయితే, తెలంగాణ ఏర్పడిన ప్రక్రియను కించపరచడం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని విపక్షాలు వాదిస్తున్నాయి. ఢిల్లీలో తెలంగాణ ఎంపీల నిరసనతో పార్లమెంట్ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొంది.