
తేజస్వీ సూర్య వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి: మంత్రి పొన్నం
లోక్‌సభలో తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో పోల్చుతూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ తీసుకుని, ఆ వివాదాస్పద వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విడుదల చేసిన ఓ విడియోలో మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి తక్షణమే స్పందించాలని కోరారు.
తెలంగాణను పాకిస్థాన్‌తో పోల్చడం క్షమించరాని నేరమని, ఆ మాటలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని ఇప్పటికే స్పీకర్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. ఇదే విషయంపై స్పందించిన కిషన్ రెడ్డి, తేజస్వీ తన తప్పును అంగీకరించినట్లు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో తెలంగాణ సమాజం మిమ్మల్ని అసహ్యించుకోకూడదనుకుంటే, కిషన్ రెడ్డి స్వయంగా లోక్‌సభ స్పీకర్‌తో మాట్లాడి ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించేలా ఒప్పించాలని పొన్నం హితవు పలికారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి కేవలం మాటలకే పరిమితం కాకుండా, తగిన కార్యాచరణ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
