
రైతులకు అండగా టెక్నాలజీ.. వాట్సాప్‌లో వాతావరణ అప్‌డేట్స్
రాష్ట్రంలోని రైతులకు సమయానుకూల వాతావరణ సమాచారం, శాస్త్రీయ వ్యవసాయ సూచనలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక అడుగు వేసింది. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో శనివారం జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “తెలంగాణ వాతావరణ సలహా కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో, డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియా (డీఐఎల్ ఇండియా), ఎవిడెన్స్ యాక్షన్ సంస్థల సంయుక్త సహకారంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సదరు సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల సమక్షంలో త్రైపాక్షిక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
ఈ కార్యక్రమానికి సాంకేతిక సహకారాన్ని అందిస్తున్న ఎవిడెన్స్ యాక్షన్ సంస్థ కంట్రీ డైరెక్టర్ అంకుర్ గర్ న్యూఢిల్లీ నుంచి జూమ్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తమ సంస్థ రైతుల సంక్షేమం కోసం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారంగా రూపొందించిన వినూత్న డిజిటల్ సేవల వివరాలను మంత్రికి వివరించారు. తెలంగాణలో అమలు కానున్న ఈ సరికొత్త విధానం ద్వారా లక్షలాది మంది రైతులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వాట్సాప్ ద్వారా క్షేత్రస్థాయికి వాతావరణ సమాచారం
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మారుతున్న వాతావరణ పరిస్థితులు అనావృష్టి/అతివృష్టి సవాళ్లు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో రైతులకు ఖచ్చితమైన ముందస్తు వాతావరణ సమాచారాన్ని చేరవేయడం ఎంతో ముఖ్యమని ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్షేత్రస్థాయిలో రైతులకు నేరుగా ఉపయోగపడేలా మండలాల వారీగా వర్షపాతం, ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు వాట్సాప్ ద్వారా పంపిస్తాం" అని మంత్రి స్పష్టం చేశారు.
ఈ సరికొత్త ఏఐ ఆధారిత వ్యవస్థ ద్వారా రైతులు విత్తే సమయం నుంచి కోతల వరకు సరైన నిర్ణయాలు తీసుకోగలరని దీనివల్ల పంట నష్టాలు తగ్గి ఉత్పాదకతతో పాటు రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం రాబోయే రుతుపవనాలు, వర్షపాత అంచనాలకు సంబంధించిన తొలి అధికారిక వాతావరణ సందేశాన్ని మంత్రి తన చేతుల మీదుగా వాట్సాప్ ద్వారా రైతులకు పంపి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
అయితే కేవలం సందేశాల రూపంలోనే కాకుండా రైతులు తమకు వచ్చే వాతావరణ, వ్యవసాయ అనుమానాలను నేరుగా వాయిస్ (వాయిస్ నోట్) రూపంలో అడిగి తక్షణమే సమాధానాలు పొందేలా ఈ వేదికను మరింత సరళంగా అప్‌గ్రేడ్ చేయాలని మంత్రి సాంకేతిక నిపుణులకు సూచించారు. ప్రస్తుతం మండల స్థాయికి పరిమితమైన ఈ డిజిటల్ సేవలను భవిష్యత్తులో ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు చేరేలా అవసరమైన సాంకేతిక మార్పులు చేయాలని కోరారు.
మరోవైపు వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్రమోహన్ మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో జోడించడంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. "తెలంగాణ రైజింగ్-2047" విజన్‌లో భాగంగా సుస్థిర వ్యవసాయాభివృద్ధిని సాధించడానికి ఈ ఏఐ సాంకేతికత ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో 'ఎల్‌నినో' వంటి క్లిష్ట వాతావరణ పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకునేలా రైతులను ముందే అప్రమత్తం చేసే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉందన్నారు.
ప్రస్తుతానికి రాష్ట్రంలోని రైతు భరోసా వేదికల్లో ఫోన్ నంబర్లు నమోదైన 17 జిల్లాలకు చెందిన 304 మండలాల పరిధిలోని సుమారు 15 లక్షల మంది రైతులకు మొదటి విడతగా ఈ వాట్సాప్ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన వెల్లడించారు.
