Let's talk: editor@tmv.in
పాలనలో టెక్నాలజీ..90 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

పాలనలో టెక్నాలజీ..90 శాతం ప్రజా సంతృప్తే లక్ష్యం: కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు

Panthagani Anusha
8 మే, 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతికత, పారదర్శకత, సమిష్టి కృషి ప్రాతిపదికన ముందుకు సాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన ఏడవ కలెక్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల అమలులో 90 శాతం కంటే ఎక్కువ ప్రజా సంతృప్తిని సాధించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా కలెక్టర్లు వినూత్న విధానాలను అనుసరించాలని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించారు.

పెట్టుబడుల హబ్‌గా ఆంధ్రప్రదేశ్

గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఆర్థిక పురోగతిని సీఎం ఈ సందర్భంగా వివరించారు. 17 రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశాల ద్వారా దాదాపు రూ. 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆమోదం పొందాయని దీని ద్వారా రాష్ట్రంలో 24 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించగలమని వెల్లడించారు. విశాఖపట్నం టెక్నాలజీ హబ్‌గా అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపుదిద్దుకుంటున్నాయని అదేవిదంగా గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాకతో రాష్ట్ర ప్రాధాన్యత అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతుందని పేర్కొన్నారు.

పాలనలో జవాబుదారీతనం – రేటింగ్ వ్యవస్థ

ప్రభుత్వ పని తీరును మెరుగుపరిచేందుకు మంత్రులు, కలెక్టర్లకు రేటింగ్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అధికారులు కేవలం ఫైళ్ల కదలికలకే పరిమితం కాకుండా, ఫలితాలపై దృష్టి సారించాలని అందుకు అధికారులు తరచుగా ఫీల్డ్ సందర్శనల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. ఇక 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని డిసెంబర్ నాటికి అన్ని ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని డెడ్‌లైన్ విధించారు. జిల్లాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఉత్తమ పనితీరు కనబరిచిన వారిని ఇతరులకు 'మెంటర్లు'గా నియమిస్తామని తెలిపారు.

గత ప్రభుత్వంపై విమర్శలు..ఆర్థిక సవాళ్లు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రూ. 9.74 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిందని సీఎం ఆరోపించారు. కేంద్ర పథకాలకు సంబంధించిన రూ. 10,000 కోట్లను మళ్లించారని, రోడ్ల వ్యవస్థను ధ్వంసం చేశారని విమర్శించారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా లీకేజీలను అరికట్టిందని విద్యుత్ కొనుగోలు ఖర్చును ఇప్పటికే 30 పైసలు తగ్గించామని తెలిపారు. కాగా ఇటీవల రాష్ట్రానికి లభించిన 'బిజినెస్ రిఫార్మర్ అవార్డు'ను ప్రస్తావిస్తూ ఇది గ్రామస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరి సమిష్టి కృషి ఫలితమని కొనియాడారు.

'నేను కాదు... మనం' – సరికొత్త నినాదం

ఈ సమావేశంలో సీఎం ఒక కీలకమైన మార్పును ప్రకటించారు. అభివృద్ధి సాధనలో వ్యక్తిగత ఇమేజ్ కంటే టీమ్ వర్క్ ముఖ్యమని చెబుతూ నేను కాదు… మనం అనే నినాదాన్ని ఇచ్చారు. ఇకపై తాను కూడా 'నేను' అనే పదం కంటే 'మనం' అనే భావనతోనే ముందుకు సాగుతానని తెలిపారు. సింగపూర్‌లోని ఉత్తమ పాలనా విధానాలను రాష్ట్రంలో అమలు చేసేందుకు ఒక జిల్లాను మోడల్‌గా ఎంపిక చేయాలని దీని కోసం 90 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు .

భవిష్యత్తు ప్రణాళికలు

రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి గానూ విశాఖ, సూర్యలంక, మంగినపూడి వంటి ప్రాంతాల్లో బీచ్ టూరిజం, బీచ్ ఫ్రంట్‌లను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. అల్లూరి జిల్లాలో కాఫీ పంటకు లభించిన విలువ జోడింపు తరహాలో ప్రతి జిల్లాలో ఉన్న ప్రత్యేక వనరులను గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సులభమైందని టెక్నాలజీని వాడుకుంటూ రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.