

నేర పరిశోధనలో సాంకేతిక విప్లవం.. సీఐడీ కంప్యూటర్ ల్యాబ్, షీ సైబర్ ల్యాబ్‌లను ప్రారంభించిన డీజీపీ
సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో నేరాల స్వరూపం కూడా మారుతోందని, అలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికత వినియోగమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు కీలకమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సి.వి. ఆనంద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు షీ సైబర్ ల్యాబ్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత స్మార్ట్ క్రైమ్ అనాలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్, స్మార్ట్ కాన్ఫరెన్స్ సదుపాయాలతో రూపొందించిన ఈ వ్యవస్థ నేర పరిశోధనలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని డీజీపీ తెలిపారు. సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక వినియోగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు.
సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తు, డేటా ఆధారిత పోలీసింగ్, క్రైమ్ అనాలిటిక్స్ రంగాల్లో తెలంగాణ పోలీస్ శాఖ గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు, నేరాలపై వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు కొత్త సాంకేతిక వ్యవస్థలను నిరంతరం అందుబాటులోకి తీసుకొస్తున్నామని వివరించారు.
సీఐడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్‌లో మాట్లాడుతున్న వ్యక్తిని కెమెరా స్వయంచాలకంగా గుర్తించి అతని వైపు తిరగడం, వీడియో-ఆడియో రికార్డింగ్ చేయడం వంటి ఆధునిక సదుపాయాలు ఉన్నాయి. సమావేశాల సమాచారాన్ని డిజిటల్ రూపంలో భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు తిరిగి విశ్లేషించే వీలుంది. డిజిటల్ బోర్డులు, మానిటర్లపై ఉన్న సమాచారాన్ని టెక్స్ట్, ఆడియో లేదా నివేదికలుగా మార్చే సామర్థ్యం కూడా ఈ వ్యవస్థకు ఉంది.
ఏఐ సాయంతో క్రైమ్ మ్యాపింగ్, డేటా ఫిల్టరింగ్, నేర ధోరణుల విశ్లేషణ, కేసుల సమీక్ష వంటి ప్రక్రియలు మరింత వేగవంతంగా, ఖచ్చితంగా నిర్వహించవచ్చని అధికారులు తెలిపారు. బాధితులు, ఫిర్యాదుదారుల అభిప్రాయాలను డిజిటల్ రూపంలో నమోదు చేసి విశ్లేషించే సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ ల్యాబ్‌ల ద్వారా దర్యాప్తు ప్రక్రియ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని డీజీపీ ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీజీ ఏసీబీ & సీఐడీ చారుసిన్హా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
