
ఏపీ యువతకు ‘టెక్’ భరోసా.. 10 లక్షల మందికి అంతర్జాతీయ స్థాయి శిక్షణ
మారుతున్న కాలానికి అనుగుణంగా రాష్ట్ర యువతను ప్రపంచ స్థాయి నిపుణులుగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ప్రముఖ అంతర్జాతీయ సంస్థ (ఐబీఎం) భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ‘డీప్-టెక్ స్కిల్లింగ్’ అనే శిక్షణా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో 10 లక్షల మంది విద్యార్థులకు అత్యాధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇవ్వడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో లోతైన అవగాహన కల్పిస్తారు. కేవలం పుస్తక పాఠాలకే పరిమితం కాకుండా డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పరిశ్రమలకు అవసరమైన ప్రయోగాత్మక శిక్షణను అందిస్తారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సర్టిఫికేట్లు అందజేస్తారు.
దీనికి తోడు సాంకేతిక విద్యను ప్రోత్సహించేందుకు గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా ప్రత్యేక ‘ఇన్నోవేషన్ స్కిల్లింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ (నైలిట్ ) సహకారంతో నడిచే ఈ సెంటర్లో ఆధునిక ప్రయోగశాలలు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు ఉండనున్నాయి. ముఖ్యంగా క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ టెక్నాలజీ వంటి భవిష్యత్ అవసరాలపై పరిశోధనలు, శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కేంద్రం అందుబాటులోకి రానుండటం విశేషం.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూఆంధ్రప్రదేశ్‌ను ‘క్వాంటమ్ వ్యాలీ’గా మార్చడమే తమ సంకల్పమని ఇప్పటికే జాతీయ స్థాయి (ఎన్.పి.టి.ఈ.ఎల్) పరీక్షల్లో రాష్ట్ర విద్యార్థులు 4 బంగారు, 14 వెండి పతకాలు సాధించి తమ సత్తా చాటారని, వారిని చూసి గర్విస్తున్నానని తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణలతో రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
