Let's talk: editor@tmv.in
2011కి ముందున్న టీచర్లకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి: వైఎస్ జగన్

2011కి ముందున్న టీచర్లకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి: వైఎస్ జగన్

Gaddamidi Naveen
9 జులై, 2026

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధనలతో రాష్ట్రంలోని టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం తన 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు.

టెట్ నిబంధనల వల్ల లక్ష మందికి పైగా ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోకపోవడం అన్యాయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 2011కు ముందు నుంచే టీచర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికీ టెట్‌ పరీక్షను తప్పనిసరి చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. 20 నుంచి 25 ఏళ్లకు పైగా సబ్జెక్టు టీచర్లుగా పనిచేస్తున్న వారిని ఇప్పుడు అన్ని సబ్జెక్టుల సిలబస్‌తో కూడిన టెట్‌ పరీక్ష రాయాలని, అందులోనూ కనీసం 60 శాతం మార్కులు సాధించాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఈ ఉపాధ్యాయులందరూ అప్పట్లో నిర్వహించిన డీఎస్సీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగాలు పొందారని, ఆ సమయంలో టెట్‌ అనే పరీక్షే లేకపోయినప్పుడు ఇప్పుడు అదే పరీక్షను తప్పనిసరి చేయడం సరైన విధానం కాదని జగన్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యాహక్కు చట్టం ప్రకారం 2011 నుంచి టెట్‌ను తప్పనిసరి చేసిన నేపథ్యంలో, ఆ చట్టం అమల్లోకి రాకముందే ఉద్యోగాల్లో చేరిన వారికి ఈ నిబంధన వర్తింపజేయడం న్యాయబద్ధం కాదన్న ఉపాధ్యాయుల వాదనలో సమంజసం ఉందని పేర్కొన్నారు.

టెట్‌ నిబంధనల కారణంగా ప్రమోషన్లు నిలిచిపోవడమే కాకుండా, ఉద్యోగ భద్రతపై కూడా అనిశ్చితి నెలకొని ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన అన్నారు. అయినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

ఈ అంశంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్న ఆలోచన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేకపోయిందని జగన్‌ ఆరోపించారు. 2011కు ముందు నుంచే సేవల్లో ఉన్న ఉపాధ్యాయులందరికీ టెట్‌ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆయన డిమాండ్‌ చేశారు. అప్పట్లో పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయనే విషయాన్ని విస్మరించకూడదని జగన్‌ మరోసారి గుర్తు చేశారు.

టీచర్ల ఇబ్బందుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కనీస ధ్యాస లేదని జగన్ విమర్శించారు. తక్షణమే అసెంబ్లీలో చట్ట సవరణ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. 2011కు ముందు నుంచే సేవల్లో ఉన్న టీచర్లందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి, ఉపాధ్యాయులకు తగిన ఉపశమనం కలిగించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. అప్పట్లో పోటీ పరీక్షల్లో అర్హత సాధించిన తర్వాతే వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు లభించాయనే విషయాన్ని విస్మరించకూడదని జగన్‌ మరోసారి గుర్తు చేశారు.

ట్యాగ్‌లు
APTeachersTETTETExemptionTeacherIssuesYSJaganChandrababuNaiduAndhraPradeshEducationTeacherRights
2011కి ముందున్న టీచర్లకు ‘టెట్’ నుంచి మినహాయింపు ఇవ్వాలి: వైఎస్ జగన్ - Tholi Paluku