Let's talk: editor@tmv.in
టీడీపీ ‘హైబ్రిడ్ మహానాడు’ అట్టర్ ఫ్లాప్: మాజీ మంత్రి ఆర్కే రోజా

టీడీపీ ‘హైబ్రిడ్ మహానాడు’ అట్టర్ ఫ్లాప్: మాజీ మంత్రి ఆర్కే రోజా

Gaddamidi Naveen
29 మే, 2026

విజయవాడలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నిర్వహిస్తున్న వార్షిక ఉత్సవం ‘హైబ్రిడ్ మహానాడు’ ఒక అట్టర్ ఫ్లాప్ షోగా మారిందని వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. నియోజకవర్గాల్లో డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేసినప్పటికీ, టీడీపీ ప్రసంగాలు వినడానికి ప్రజలే కాదు, ఆ పార్టీ కార్యకర్తలు కూడా స్క్రీన్ల ముందు కూర్చోవడం లేదని ఎద్దేవా చేశారు. గురువారం చిత్తూరు జిల్లా నగరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఆమె నిప్పులు చెరిగారు.

బీర్లు, బిర్యానీలు పెట్టినా జనం రాకపోవడంతో రికార్డింగ్ డ్యాన్స్‌లు పెడుతున్నారని, డ్వాక్రా మహిళలను బలవంతంగా సభలకు తరలిస్తున్నారని రోజా ఆరోపించారు. రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కటీ అమలు చేయలేకపోయిన ప్రభుత్వం, ఇప్పుడు డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. మహానాడు వేదికగా ప్రజలకు సమాధానాలు చెప్పాల్సింది పోయి.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ కాలిగోటికి కూడా సరిపోని నాయకులు మైక్ దొరికిందని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఇది సైకిల్ పార్టీ మహానాడా లేక సైకో పార్టీ మహానాడా అని ప్రజలు అనుకుంటున్నారన్నారు. దీన్ని మహానాడు అనడం కంటే దగానాడు, మాయనాడు అనడం కరెక్ట్ అని పేర్కొన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో టీడీపీ రెండు నాలుకల ధోరణిని అవలంబిస్తోందని రోజా విమర్శించారు. పార్లమెంట్‌లో బిల్లును అడ్డుకునే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నాయకులతో టీడీపీ మహిళా ప్రతినిధులు ఢిల్లీలో లంచ్‌లు, డిన్నర్లు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మహిళా బిల్లును వ్యతిరేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీడీపీ మహిళా నేతలు కలిసి చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలు దిగారు. పార్లమెంట్‌లో పెట్టకపోయినా నాడు అసెంబ్లీలోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి అమలు చేసిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని రోజా గుర్తుచేశారు.

ఉదయం బీజేపీతో బ్రేక్‌ఫాస్ట్, రాత్రి కాంగ్రెస్‌తో డిన్నర్ చేసే దొంగ రాజకీయాలు టీడీపీకి అలవాటని విమర్శించారు. నిజంగా మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే, కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. బిల్లు ఆమోదం పొందకపోతే మద్దతు ఉపసంహరిస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని రోజా సవాల్ విసిరారు. కూటమి నాయకులు తమ హామీలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక గొడ్డలి పార్టీ, తల్లి, చెల్లి అంటూ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని, చంద్రబాబు తన హెరిటేజ్ ఆస్తుల్లో తల్లికి, చెల్లికి ఎంత ఇచ్చారో ముందు చెప్పాలని డిమాండ్ చేశారు.