Let's talk: editor@tmv.in
దివంగత నేతలపై టీడీపీ వ్యాఖ్యలు రాజకీయ అక్కసే: వైఎస్ షర్మిల

దివంగత నేతలపై టీడీపీ వ్యాఖ్యలు రాజకీయ అక్కసే: వైఎస్ షర్మిల

Panthagani Anusha
27 మే, 2026

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డిలపై తెలుగుదేశం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు మన మధ్య లేని తమపై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పుకోలేని వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేయడం రాజకీయ అక్కసుతో కూడుకున్నదేనని ఆమె అన్నారు. ప్రభుత్వం తన పరిపాలనా లోపాలను రాజకీయ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి పనులు చేస్తోందని ఆమె ఆరోపించారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందించిన వైఎస్ షర్మిల టిడిపి వైఖరిపై గట్టి ప్రశ్నలు సంధించారు. రాజారెడ్డి, వైఎస్సార్ నిజంగా అంత తప్పులు చేసి ఉంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదు? ఎందుకు శిక్షించలేదు? అని ఆమె నిలదీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నప్పటికీ ప్రజలకు చెప్పుకోదగ్గ ఎలాంటి విజయాలు లేకపోవడంతోనే ప్రజల దృష్టిని మళ్లించడానికి దివంగత నేతలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు.

రాయలసీమలో జరిగిన అన్యాయాలకు ఎదురు నిలిచి, నిరంతరం పేదల పక్షాన పోరాడిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజారెడ్డి అని షర్మిల గుర్తు చేశారు. 1973లోనే కడప జిల్లాలో 70 పడకల ఆసుపత్రిని నిర్మించి పేదలకు ఉచిత వైద్యం అందించారని అదేవిదంగా పేద విద్యార్థుల కోసం డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేసి ఉచిత చదువుకు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. అలాంటి ప్రజాసేవకుడి చరిత్రను వక్రీకరించి చూపించాలని చూస్తే రాయలసీమ ప్రజలు అస్సలు సహించరని ఆమె హెచ్చరించారు.

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన అంతా పేదల సంక్షేమం, అభివృద్ధికి ప్రతీకగా సాగిందని షర్మిల కొనియాడారు. ఈ రోజు ప్రజలు అనుభవిస్తున్న ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్, రైతుల రుణమాఫీ వంటి చారిత్రాత్మక పథకాలు వైఎస్సార్ తెచ్చినవేనని గుర్తుచేశారు. రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు పనులను వైఎస్సార్ తన ఐదేళ్ల పాలనలో 33 శాతం పూర్తి చేస్తే.. ఆ తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్. చంద్రబాబు నాయుడు మిగిలిన పనులను ఎందుకు పూర్తి చేయలేకపోయారని ఆమె ప్రశ్నించారు.

వైఎస్సార్‌పై ఎంత బురదజల్లాలని చూసినా ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానాన్ని ఎవరూ తగ్గించలేరని షర్మిల ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్ మరణ వార్త విని తట్టుకోలేక వందలాది మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారని, తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. ఎన్ని కుట్రలు చేసినా ప్రజల మనసుల నుంచి ఆయన జ్ఞాపకాలను చెరపడం ఎవరితరం కాదన్నారు. ఒకప్పుడు కడప జిల్లాను పీడించిన ఫ్యాక్షన్ రాజకీయాలు అంతరించిపోవడానికి కూడా వైఎస్సార్ చేసిన కృషే కారణమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా అధికారంలో ఉన్నవారు దివంగత నేతలపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకొని ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని షర్మిల హితవు పలికారు.