Let's talk: editor@tmv.in
ప్రజల మద్దతుతోనే టీడీపీ 45 ఏళ్ల ప్రయాణం: సీఎం చంద్రబాబు

ప్రజల మద్దతుతోనే టీడీపీ 45 ఏళ్ల ప్రయాణం: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
28 మే, 2026

తెలుగుదేశం పార్టీ వార్షిక మహాసభ ‘మహానాడు’ బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. తొలిరోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌లు హాజరై శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తన ప్రధాన ప్రసంగంలో పార్టీ సుదీర్ఘ ప్రస్థానాన్ని, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను వివరించగా.. నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో మహిళా ప్రాతినిధ్యంపై అత్యంత కీలకమైన రాజకీయ ప్రతిపాదన చేశారు.

ఎదురుదెబ్బలు తగిలినా వెనకడుగు వేయలేదు: సీఎం చంద్రబాబు

మహానాడు తొలిరోజు ప్రతినిధుల సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఎన్ని రాజకీయ పక్షాలు మారినా ప్రజల్లో టీడీపీపై ఉన్న ఆదరణ, మద్దతు ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం గత 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ నిరంతరం పోరాడుతోందని గుర్తుచేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఎదురైన దాడులు, హింస, హత్యా రాజకీయాలు, తప్పుడు కేసులు మరియు వేధింపులను తట్టుకుని నిలబడ్డామే తప్ప ఎన్నడూ వెనకడుగు వేయలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన అక్రమ అరెస్టును నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాలను ప్రస్తావిస్తూ.. వాటన్నింటినీ తిప్పికొట్టి ప్రజలు మళ్లీ టీడీపీ కూటమికి అఖండ విజయాన్ని, అధికార బాధ్యతలను అప్పగించారని చంద్రబాబు అన్నారు.

తదుపరి తరాల భవిష్యత్తే మా లక్ష్యం

టీడీపీని నాయకులను తయారుచేసే ఒక ‘విశ్వవిద్యాలయం గా చంద్రబాబు అభివర్ణించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల సంక్షేమం కోసం ఇప్పటివరకు రూ.160 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇకపై పార్టీ కేవలం రాబోయే ఎన్నికల కోసం మాత్రమే కాకుండా, ‘జెన్-జెడ్’, ‘ఆల్ఫా’ వంటి భవిష్యత్ తరాల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. కృత్రిమ మేధస్సు (ఏఐ), క్వాంటమ్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాలు అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్‌కు ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. యువతను స్టార్టప్‌లు, సరికొత్త ఆవిష్కరణల వైపు ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు.

‘మహిళా మహానాడు’గా వార్షిక సభలు.. 5 లక్షల మంది పారిశ్రామికవేత్తలే ధ్యేయం

2024 ఎన్నికల విజయంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, అందుకే ఈసారి మహానాడును ‘మహిళా మహానాడు’గా నిర్వహిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఏడాది కాలంలో లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చామని, రాబోయే రోజుల్లో మరో ఐదు లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కేవలం సంక్షేమ పథకాలకే పరిమితం కాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన, విద్యా, ఉపాధి రంగాల్లో అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

2029లో మహిళలకు 33 శాతం సీట్లు: ఐటీ మంత్రి నారా లోకేష్ చారిత్రాత్మక ప్రతిపాదన

మహానాడు వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఒక చారిత్రాత్మక రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాబోయే 2029 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున మహిళలకు కచ్చితంగా 33 శాతం సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి ఆమోదం లభించి అమలులోకి వచ్చినా రాకపోయినా.. టీడీపీ ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ముందే అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలవాలని ప్రతిపాదించారు.

కాగా గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష కూటమి పార్టీలు ఆ బిల్లు ముందుకు సాగకుండా అడ్డుకున్నాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల సమయంలో మాత్రమే మహిళా ఓటర్ల గురించి మాట్లాడి ఆ తర్వాత విస్మరించే ఇతర పార్టీల లాగా కాకుండా టీడీపీ ఆవిర్భావం (ఎన్టీఆర్ కాలం) నుంచే ‘స్త్రీ శక్తి’ని నమ్ముతూ మహిళా సాధికారతకు అగ్రతాంబూలం ఇస్తోందని లోకేష్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఒకే విడతలో జరగనున్న 2029 లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ ఇప్పుడే మహిళా రిజర్వేషన్ల అజెండాను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.