
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించింది. పార్టీ తరఫున చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌లను అభ్యర్థులుగా నామినేట్ చేసింది. శనివారం రాత్రి పార్టీ సీనియర్ నాయకుల సమక్షంలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురు అభ్యర్థులకు అధికారికంగా ‘బి-ఫామ్స్’ అందజేశారు.
తనకు ఈ అవకాశం కల్పించినందుకు చింతకాయల విజయ్ పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన నాయకులను, కార్యకర్తలను ఎల్లప్పుడూ గుర్తిస్తారని చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ మరోసారి నిరూపించారని ఆయన కొనియాడారు. తనకు దక్కిన ఈ అవకాశానికి చంద్రబాబు, లోకేష్‌లకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని, రాజ్యసభ సభ్యుడిగా తన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వర్తిస్తానని విజయ్ స్పష్టం చేశారు.
చింతకాయల విజయ్ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. విజయ్ భారతదేశం, అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి పొలిటికల్ మేనేజ్‌మెంట్, గవర్నెన్స్ అంశాలలో డిగ్రీలు పూర్తి చేశారు.
మరో అభ్యర్థి భాష్యం రామకృష్ణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్న ఒక ప్రముఖ ప్రైవేట్ విద్యా సమూహానికి ఛైర్మన్‌గా ఉన్నారు. విద్యా రంగంలో ఆయన చేసిన కృషికి గాను పలు అవార్డులు అందుకున్నారు. తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, హెల్త్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, దేశంలోని వివిధ ప్రాంతాలలో విపత్తు సహాయక చర్యలు వంటి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అధికార ఎన్డీయే కూటమి ఒప్పందం ప్రకారం.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను టీడీపీ మూడు స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షమైన జనసేన పార్టీ మిగిలిన ఒక స్థానంలో పోటీ చేస్తోంది. జూన్ 18న జరగనున్న ఎన్నికల అనంతరం రాష్ట్రం నుంచి రాజ్యసభలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.
