
టోల్ ప్లాజా వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనుచరుల వీరంగం
అన్నమయ్య జిల్లా గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్ద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎ. సురేంద్ర బాబు అనుచరులు రెచ్చిపోయారు. సామాన్య ప్రయాణికుల్లా కాకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ టోల్ సిబ్బందిపై భౌతిక దాడులకు తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ప్లాజా మేనేజర్‌తో పాటు పలువురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసుల కథనం ప్రకారం ఏప్రిల్ 25వ తేదీ ఉదయం సుమారు 9:45 గంటల సమయంలో తిరుమల నుంచి మదనపల్లె వైపు ఎమ్మెల్యే సురేంద్ర బాబు వాహనం ప్రయాణిస్తోంది. గండబోయినపల్లె టోల్ ప్లాజా వద్దకు చేరుకునే సరికి, ఎమ్మెల్యే వాహనానికి ముందున్న రెండు వాహనాలు ఆన్‌లైన్ చెల్లింపుల ప్రక్రియలో జాప్యం కారణంగా నిలిచిపోయాయి. దీనితో ఎమ్మెల్యే కాన్వాయ్‌కు కొద్ది నిమిషాల పాటు అంతరాయం ఏర్పడింది. టోల్ సిబ్బంది జాప్యానికి గల కారణాన్ని వివరించే ప్రయత్నం చేసినప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు అసహనానికి గురయ్యారు.
బ్యారియర్లు ధ్వంసం.. సిబ్బందిపై దౌర్జన్యం
ఎమ్మెల్యే ఎస్కార్ట్ వాహనంలోని వ్యక్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ వాహనాల నుంచి కిందకు దిగారు. టోల్ గేట్ బ్యారియర్‌ను బలవంతంగా విరగ్గొట్టి ప్లాజాలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో అడ్డువచ్చిన మహిళా ఉద్యోగిని ఎం. శ్రీలతపై దాడికి పాల్పడ్డారు. ఆమె జుట్టు పట్టుకుని లాగి దుర్భాషలాడినట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ గందరగోళం గమనించి కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ప్లాజా మేనేజర్ ఎన్. రవి బాబుపై ఎమ్మెల్యే అనుచరులు విరుచుకుపడ్డారు. ఆయనను పై అంతస్తు నుంచి ఈడ్చుకుంటూ కిందికి లాక్కొచ్చి విచక్షణా రహితంగా కొట్టినట్లు సమాచారం. ఏం జరుగుతుందో అడిగే లోపే నాపై దాడికి దిగారు ప్రాధేయపడినా వినకుండా కొట్టారు" అని మేనేజర్ రవిబాబు మీడియా ప్రతినిధులకు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. టోల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిపై దాడి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టోల్ ప్లాజా సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై లోతైన దర్యాప్తు ప్రారంభించారు.
