Let's talk: editor@tmv.in
ఐదేళ్లలో 30 బిలియన్ డాలర్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
ఐదేళ్లలో 30 బిలియన్ డాలర్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

ఐదేళ్లలో 30 బిలియన్ డాలర్ల సముద్ర ఉత్పత్తుల ఎగుమతే లక్ష్యం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

Gaddamidi Naveen
6 జూన్, 2026

రాబోయే ఐదేళ్లలో భారతదేశం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 30 బిలియన్ డాలర్ల మార్కును లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఈ ఎగుమతుల విలువ 8 బిలియన్ డాలర్లుగా ఉందని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన ‘సీఫుడ్ ఎగుమతుల జాతీయ వర్క్‌షాప్’లో ఆయన ప్రసంగించారు.

ఈ సంద‌ర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు కేవలం 5 బిలియన్ డాలర్లుగా ఉండేవని మంత్రి గుర్తుచేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ నాయకత్వంలో వారం రోజుల క్రితమే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈ రంగం ఐదేళ్లలో కనీసం 30 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని మేము భావించాం అని గోయల్ పేర్కొన్నారు. నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, ఉత్పత్తిని మరింత పెంచడం ద్వారా ఈ మైలురాయిని సులువుగా అందుకోవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశం, అమెరికా దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన మొదటి విడత జులై మధ్య నాటికి అమలు చేయవచ్చని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. ప్రాంతీయ పోటీ దేశాల కంటే ముందే భారతీయ ఎగుమతిదారులకు ప్రాధాన్యత గల మార్కెట్ ప్రాప్యతను (ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్) కల్పించడమే లక్ష్యంగా ఇరు దేశాల వాణిజ్య అధికారులు చర్చలను ముగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ వారంలో దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన వరుస వాణిజ్య చర్చల తర్వాత ఈ కీలక పురోగతి లభించింది. ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు అమెరికా వాణిజ్య విభాగానికి చెందిన పూర్తి స్థాయి అధికారుల బృందంతో ఢిల్లీలో అద్భుతమైన చర్చలు జరిగాయని మంత్రి తెలిపారు. తాను కూడా గురువారం ఆ అధికారులను కలిశానని, మిగిలి ఉన్న అన్ని అంశాలను వేగంగా ముగించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈ ప్రాథమిక ప్యాకేజీని మరింత బలోపేతం చేయడానికి రాబోయే వారాల్లో మరిన్ని ఉన్నత స్థాయి సమావేశాలు జరుగుతాయని, బహుశా ఈ నెలాఖరులో మరింత ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం భారత్‌కు రానుందని ఆయన వెల్లడించారు.

ఎగుమతుల్లో ముందంజ

2013-14తో పోలిస్తే భారతదేశం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో 70 శాతం వృద్ధిని సాధించిందని గోయల్ వెల్లడించారు. కాగా, 2024 నాటికి అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తుల మార్కెట్ 10 శాతం వృద్ధితో 160 బిలియన్ డాలర్లకు చేరుకుందని వివరించారు. భారత్ నుంచి జరుగుతున్న ఎగుమతుల్లో దాదాపు 80 శాతం వాటా కేవలం మొదటి 10 అగ్ర దేశాలకే పరిమితమైందని, అందువల్ల దేశం సాధించిన విజయాలను పునఃసమీక్షించుకుంటూ కొత్త అవకాశాలను అన్వేషించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఇదే భారతదేశ వృద్ధి కథనమని, మన ఎగుమతిదారులకు ఉన్న అసలైన సామర్థ్యం ఇదేనని మంత్రి పీయూష్ గోయల్ ప్రశంసించారు.

ప్రభుత్వ చేయూత – స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు

చేపల పెంపకం (ఫిషరీస్) రంగాన్ని, వ్యాపారాన్ని అపూర్వమైన రీతిలో ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం 'పీఎం మత్స్య సంపద యోజన' కింద రూ. 21,000 కోట్లను కేటాయించిందని, ఇది ఈ రంగానికి కొండంత అండగా నిలుస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంలో, భారతదేశం గత మూడు నుంచి మూడున్నర ఏళ్ల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకుందని గోయల్ స్పష్టం చేశారు. ఈ తొమ్మిది ఒప్పందాల పరిధిలోకి వచ్చే 38 దేశాలూ ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన, అధిక ఆదాయం కలిగిన దేశాలే కావడం గమనార్హం.