
తమిళనాడు ఎన్నికలు..18 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్ నివేదిక
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రణక్షేత్రంలో అభ్యర్థుల ఎంపికపై రాజకీయ పార్టీల ప్రాధాన్యతలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బరిలో ఉన్న అభ్యర్థుల నేర చరిత్ర ఆస్తుల విలువ గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021 ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థుల శాతం 13గా ఉండగా ఈసారి అది 18 శాతానికి చేరింది. ముఖ్యంగా తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి సంఖ్య కూడా రెట్టింపు కావడం గమనార్హం.
ఎన్నికల బరిలో ఉన్న 3,992 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించగా అందులో 722 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు. ఇందులో 404 మంది (10శాతం) అభ్యర్థులు హత్యలు, కిడ్నాప్‌లు వంటి తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నారు. పార్టీల వారీగా చూస్తే ప్రధాన ప్రతిపక్షం ఏఐఏడీఎంకే అభ్యర్థుల్లో ఏకంగా 69 శాతం మంది నేరచరిత్ర కలిగిన వారే కావడం గమనార్హం. అధికార డీఎంకేతో పాటు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీల్లో 40 శాతం మంది అభ్యర్థులపై కేసులు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, వామపక్ష పార్టీలు సైతం నేరచరితులకు టికెట్లు ఇవ్వడంలో వెనకడుగు వేయలేదు.
ఇదిలా ఉండగా తమిళ రాజకీయాల్లో ధనబలం ప్రాధాన్యం గతంలో కంటే విపరీతంగా పెరిగినట్లు ఏడీఆర్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 981 మంది (25 శాతం) కోటీశ్వరులు కాగా 22 మంది వంద కోట్ల పైచిలుకు ఆస్తులు కలిగిన 'బిలియనీర్లు'. అభ్యర్థుల సగటు ఆస్తి విలువ 2021లో రూ.1.72 కోట్లు ఉండగా ప్రస్తుతం అది రూ.5.17 కోట్లకు పెరగడం విశేషం. ప్రధాన రాజకీయ పార్టీల తరఫున నిలబడ్డ అభ్యర్థుల్లో సింహభాగం కోటీశ్వరులే ఉండటం సామాన్యులకు ఎన్నికల పోటీ భారంగా మారుతోందన్న విషయాన్ని స్పష్టం చేస్తోంది.
అభ్యర్థుల విద్యార్హతలను పరిశీలిస్తే మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. 46 శాతం మంది గ్రాడ్యుయేట్లు లేదా అంతకంటే ఎక్కువ చదువుకున్న వారు కాగా 43 శాతం మంది 5 నుంచి 12వ తరగతి మధ్య విద్యను అభ్యసించిన వారు ఉన్నారు. వీరిలో 95 మంది నిరక్షరాస్యులు కూడా పోటీలో ఉన్నారు. ఇక మహిళా ప్రాతినిధ్యం విషయంలో పార్టీలన్నీ 'మహిళా సాధికారత' మాటలకే పరిమితమయ్యాయి. మొత్తం అభ్యర్థుల్లో కేవలం 11 శాతం (442 మంది) మాత్రమే మహిళలు ఉండటం పురుషాధిక్యత ఇంకా కొనసాగుతోందని నిరూపిస్తోంది.
ఆర్థికంగా బలపడుతున్న అభ్యర్థులు, పెరుగుతున్న నేరచరిత్ర తమిళనాడు ఓటరు తీర్పుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
