
తమిళనాడు, బెంగాల్ ఎన్నికలు.. రూ.865 కోట్లు సీజ్
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ గట్టి చర్యలు చేపట్టింది. ఎన్నికల ప్రకటన వచ్చినప్పటి నుండి శుక్రవారం వరకు ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు రూ.865 కోట్ల విలువైన నగదు, మద్యం, బహుమతులను అధికారులు సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టకుండా, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని కమిషన్ ఆదేశించడంతో అధికారులు తనిఖీలు ముమ్మరం చేసి అక్రమంగా తరలిస్తున్న సొత్తుపై ఉక్కుపాదం మోపుతున్నారు.
రాష్ట్రాల వారీగా జప్తు వివరాలు
ఎన్నికల సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ గణాంకాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ కంటే తమిళనాడులోనే అత్యధికంగా నగదు, ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. తమిళనాడులో మొత్తం రూ.438 కోట్ల విలువైన సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో అత్యధికంగా రూ.178 కోట్ల విలువైన ఉచిత వస్తువులు, రూ.105 కోట్ల విలువైన విలువైన లోహాలు (బంగారం, వెండి), రూ.78 కోట్ల నగదు ఉన్నాయి. మరోవైపు బెంగాల్‌లోనూ రూ.427 కోట్ల సొత్తును అధికారులు సీజ్ చేశారు. ఇక్కడ నగదు రూపంలో రూ.21 కోట్లు దొరకగా, ఏకంగా రూ. 172 కోట్ల విలువైన ఇతర వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మద్యం, మాదకద్రవ్యాల కట్టడి
మద్యం విక్రయాలు, అక్రమ రవాణాపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లో కలిపి 32.91 లక్షల లీటర్ల మద్యాన్ని (విలువ రూ.84 కోట్లు) స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 174 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.159 కోట్ల విలువైన బంగారం, వెండి ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో పట్టుబడటం కలకలం రేపుతోంది.
100 నిమిషాల్లోనే స్పందన
ఎన్నికల అక్రమాలపై వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈసీ భారీ ఎత్తున నిఘా బృందాలను రంగంలోకి దించింది. పశ్చిమ బెంగాల్‌లో 2,728, తమిళనాడులో 2,283 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు నిరంతరం గస్తీ కాస్తున్నాయి. ఏదైనా ఫిర్యాదు అందిన 100 నిమిషాల్లోనే ఈ బృందాలు అక్కడికి చేరుకుంటాయి. వ్యూహాత్మక ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసేందుకు రెండు రాష్ట్రాల్లో కలిపి 5,363 స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలను మోహరించారు.
‘సామాన్యులకు ఇబ్బంది కలగకూడదు’
తనిఖీల పేరుతో సాధారణ పౌరులను ఇబ్బందులకు గురి చేయకూడదని ఎన్నికల కమిషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తనిఖీల్లో ఏదైనా వేధింపులు ఎదురైతే ఫిర్యాదు చేసేందుకు జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరుగుతున్నట్లు గమనిస్తే.. పౌరులు తమ మొబైల్‌లోని 'సి-విజిల్' యాప్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
