Let's talk: editor@tmv.in
మహిళా బిల్లుపై ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: సీఎం చంద్రబాబు

మహిళా బిల్లుపై ప్రతిపక్షాల వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
25 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు విషయంలో ‘ఇండియా’ కూటమి అనుసరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించే ఈ చారిత్రాత్మక బిల్లును అడ్డుకునేందుకు ప్రతిపక్ష కూటమి కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఎన్డీయే కూటమికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతకు ఆటంకం కలిగిస్తున్న పార్టీల వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాలని దిశా నిర్దేశం చేశారు.

మహిళా రిజర్వేషన్లపై ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర, జిల్లా మండల స్థాయిల్లో సెమినార్లు నిర్వహించాలని ఎన్డీయే నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి మహిళా బిల్లుపై నెలకొన్న వాస్తవాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ చరిత్రంతా మహిళా రిజర్వేషన్లను అడ్డుకోవడానికే సరిపోయిందని ఈ సందర్భంగా ఎన్డీయే నాయకులు విమర్శించారు. గతంలో యూపీఏ హయాంలో రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందినప్పటికీ, బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించినా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టకుండా కాంగ్రెస్ వెనకడుగు వేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్తశుద్ధితో బిల్లును తీసుకువస్తే ‘ఇండియా’ కూటమి పార్టీలు డిలిమిటేషన్ సాకుతో అడ్డంకులు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.

నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్) అంశంపై వస్తున్న ఆందోళనలపై స్పందిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్లమెంట్ స్థానాల పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చిందని తెలిపారు. మహిళా బిల్లు సజావుగా అమలు కావడానికి అవసరమైతే మరిన్ని సవరణలు చేయడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

మహిళా సంక్షేమం తమ కూటమి డీఎన్ఏలోనే ఉందని దేశంలోనే తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని దివంగత నేత ఎన్టీ రామారావు స్థాపించారని నాయకులు గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయంగా ఎదిగేలా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని అదే స్ఫూర్తితో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ బిల్లును చట్టంగా మార్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహిళల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ‘ఇండియా’ కూటమికి రాబోయే రోజుల్లో మహిళా లోకం తగిన బుద్ధి చెబుతుందని ఆయన పేర్కొన్నారు.