
ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోండి: టీఎస్‌హెచ్ఆర్సీ ఆదేశం
ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ముందస్తుగా ఫీజులు వసూలు చేయడంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (టీఎస్‌హెచ్ఆర్సీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాల, విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తోందన్న ఫిర్యాదుపై స్పందించిన కమిషన్, అక్రమ వసూళ్లకు పాల్పడే విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
బోడుప్పల్‌లోని సదరు పాఠశాల, 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చి 2026లోనే 50 శాతం వార్షిక ఫీజును ముందస్తుగా కట్టించుకుంటోందని ఫిర్యాదుదారు పేర్కొన్నారు. కేవలం ఫీజు మాత్రమే కాకుండా పుస్తకాలు, యూనిఫాంల కోసం కూడా ముందస్తుగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యా సంవత్సరం మొదలవ్వక ముందే ఇలా సగం ఫీజు వసూలు చేయడం చట్టవిరుద్ధమని, ఇది తల్లిదండ్రులపై పెను భారమని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.
విద్య లాభాపేక్ష కలిగిన వ్యాపారం కాదు
హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని టీఎస్‌హెచ్ఆర్సీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్య ఒక మౌలిక హక్కు అని, దాన్ని లాభాపేక్షతో కూడిన కార్యకలాపంగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఫీజుల వసూలు దశలవారీగా ఉండాలని, ఒకేసారి ముందస్తుగా వసూలు చేయడం ఏకపక్ష, అనుచిత చర్య అని పేర్కొంది. నిర్దిష్ట వెండర్ల వద్దే పుస్తకాలు, దుస్తులు కొనాలని ఒత్తిడి చేయడం పారదర్శకత లేకపోవడాన్ని సూచిస్తుందని కమిషన్ అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 28న జారీ చేసిన ఉత్తర్వుల్లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా విద్యాశాఖ అధికారిని సంబంధిత పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని, విడతల వారీగా ఫీజు వసూలు చేసే నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని సిఫారసు చేసింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993 ప్రకారం తీసుకున్న చర్యలపై నిర్దిష్ట గడువులోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను ముగించింది.
