Let's talk: editor@tmv.in
T20 ప్రపంచకప్: శ్రీలంకను చిత్తు చేసిన జింబాబ్వే

T20 ప్రపంచకప్: శ్రీలంకను చిత్తు చేసిన జింబాబ్వే

Shaik Mohammad Shaffee
20 ఫిబ్రవరి, 2026

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే జట్టు తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పటిష్టమైన ఆస్ట్రేలియాను ఓడించి ఇప్పటికే ప్రకంపనలు సృష్టించిన ఈ ఆఫ్రికా జట్టు, గురువారం జరిగిన గ్రూప్‌-బి ఆఖరి పోరులో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. బ్యాటింగ్‌లో బ్రయాన్ బెన్నెట్‌ (63 నాటౌట్; 48 బంతుల్లో) బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ సికందర్ రాజా (45; 26 బంతుల్లో) తన ధాటితో లంక బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో శ్రీలంక నిర్దేశించిన 179 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇప్పటికే సూపర్‌-8కు చేరిన ఈ రెండు జట్లలో, జింబాబ్వే తన గ్రూప్‌ దశను ఒక్క ఓటమి కూడా లేకుండా అగ్రస్థానంలో ముగించడం విశేషం.

మెరిసిన బెన్నెట్‌, రాజా

నెమ్మదించిన పిచ్‌పై 179 పరుగుల ఛేదనను జింబాబ్వే ఘనంగా ఆరంభించింది. ఓపెనర్లు బెన్నెట్‌, మారుమణి (34) తొలి వికెట్‌కు 8.3 ఓవర్లలో 69 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అనంతరం వచ్చిన రయాన్ బర్ల్ (12) వెల్లలాగే బౌలింగ్‌లో 103 మీటర్ల భారీ సిక్సర్‌తో అలరించినా ఎక్కువ సేపు నిలవలేదు. అయితే కెప్టెన్ సికందర్ రాజా క్రీజులోకి రావడంతో ఆట స్వరూపం మారిపోయింది. కండరాల నొప్పితో ఇబ్బంది పడుతున్నా వెనక్కి తగ్గని రాజా.. మధుశంక ఓవర్లో రెండు సిక్సర్లు, తీక్షణ ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో స్కోరు బోర్డును ఉరికించాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు అవసరమైన దశలో టోనీ మున్యోంగా భారీ సిక్సర్‌తో విజయాన్ని ఖాయం చేశాడు.

నిస్సంక ఒంటరి పోరాటం

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్ నిస్సంక (62; 46 బంతుల్లో) మరోసారి అద్భుత అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కుశాల్ పెరీరా (22) దూకుడుగా ఆరంభించినా ముజరబానీ వేసిన బౌన్సర్‌కు పెవిలియన్ చేరాడు. పవన్‌ రత్నాయకే (44; 25 బంతుల్లో) ఆఖర్లో చెలరేగడంతో లంక గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అయితే ఇన్నింగ్స్ మధ్యలో జింబాబ్వే స్పిన్నర్లు రాజా, క్రీమర్, బర్ల్, మసకద్జా కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లంక బ్యాటర్లను కట్టడి చేశారు. మధ్యలో 4 ఓవర్లలో కేవలం 21 పరుగులే ఇచ్చి లంకను ఒత్తిడిలోకి నెట్టారు. చివరి రెండు ఓవర్లలో లంక 30 పరుగులు రాబట్టినా, అది ఆ జట్టును ఓటమి నుంచి రక్షించలేకపోయింది.

82 పరుగుల తేడాతో అఫ్గాన్‌ ఘన విజయం

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ ఘనమైన ముగింపును అందుకుంది. చెన్నై వేదికగా జరిగిన నామమాత్రపు పోరులో అఫ్గాన్ 82 పరుగుల తేడాతో కెనడాను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్థాన్, ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (95 నాటౌట్; 56 బంతుల్లో) వీరోచిత ఇన్నింగ్స్‌కు తోడు అటల్ (44) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ, జద్రాన్ ఆరు సిక్సర్లు, ఏడు ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగి కెనడా ముందు కొండంత లక్ష్యాన్ని ఉంచాడు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడా, అఫ్గాన్ స్పిన్ ధాటికి కుప్పకూలింది. వెటరన్ స్పిన్నర్ మహమ్మద్ నబీ కేవలం 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి కెనడా పతనాన్ని శాసించాడు. రషీద్ ఖాన్ రెండు వికెట్లతో రాణించడంతో కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులకే పరిమితమైంది. కెనడా జట్టులో హర్ష్ థాకర్ (30) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో అఫ్గానిస్థాన్ టోర్నీ నుంచి సగర్వంగా నిష్క్రమించగా, ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే కెనడా ఇంటిబాట పట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి ఉంటే అఫ్గాన్ పరిస్థితి మరోలా ఉండేది.

విండీస్‌ వరుసగా నాలుగో విజయం

టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ తమ ఆధిపత్యాన్ని చాటుతూ గ్రూప్ దశను అజేయంగా ముగించింది. కోల్‌కతా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇటలీపై 42 పరుగుల తేడాతో విండీస్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్, కెప్టెన్ షాయ్ హోప్ (75; 46 బంతుల్లో) మెరుపు అర్ధసెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఇటలీ బౌలర్లలో మనెంటి, కలుగమేగే తలా రెండు వికెట్లతో రాణించి విండీస్ స్కోరును కట్టడి చేశారు.

అనంతరం 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇటలీ, విండీస్ బౌలర్ల ధాటికి 18 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. విండీస్ బౌలర్లలో షామర్ జోసెఫ్ (4 వికెట్లు), మాథ్యూ ఫోర్డ్ (3 వికెట్లు), గుడకేష్ మోటీ (2 వికెట్లు) అద్భుతంగా బౌలింగ్ చేసి ఇటలీని దెబ్బతీశారు. ఈ విజయంతో వెస్టిండీస్ గ్రూప్-సిలో అన్ని మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంతో సూపర్‌-8కు చేరుకోగా, ఇటలీ ఒక విజయంతో తన ప్రయాణాన్ని ముగించింది