
మాడ్రిడ్ ఓపెన్ నుంచి స్వైటెక్ ఔట్
ప్రపంచ టెన్నిస్ దిగ్గజం, నాలుగో ర్యాంకర్ ఇగా స్వైటెక్‌కు మాడ్రిడ్ ఓపెన్‌లో చుక్కెదురైంది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ రౌండ్-32 పోటీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ఆన్ లీతో తలపడుతున్న సమయంలో స్వైటెక్ ఒక్కసారిగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె మ్యాచ్ మధ్యలోనే వైదొలుగుతున్నట్లు ప్రకటించి టోర్నీ నుంచి నిష్క్రమించారు. స్వైటెక్ నిర్ణయంతో ఆన్ లీకి వాకోవర్ లభించింది.
పోరాడి.. ఆపై అలసి..
మ్యాచ్ ఆరంభం నుండి ఇరు ఆటగాళ్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌ను ఆన్ లీ 7-6 (4)తో కైవసం చేసుకోగా, రెండో సెట్‌లో పుంజుకున్న స్వైటెక్ 6-2తో ప్రత్యర్థిని చిత్తు చేసి రేసులోకి వచ్చారు. అయితే నిర్ణయాత్మకమైన మూడో సెట్‌లో స్వైటెక్ తడబడ్డారు. ఆ సెట్‌లో 0-2తో వెనుకంజలో ఉన్న సమయంలో ఆమెకు తీవ్ర అస్వస్థతగా అనిపించడంతో మెడికల్ టైమౌట్ తీసుకున్నారు. కాసేపటి తర్వాత తిరిగి కోర్టులోకి వచ్చినప్పటికీ, ప్రత్యర్థి ఆన్ లీ తన సర్వీస్‌ను నిలబెట్టుకుని 3-0తో ఆధిక్యంలోకి వెళ్లడంతో స్వైటెక్ ఇక ఆడలేక మ్యాచ్‌ను వదిలేశారు.
2024 మాడ్రిడ్ ఓపెన్ ఛాంపియన్‌గా నిలిచిన స్వైటెక్, ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. రెండో రౌండ్‌లో దారియా స్నిగూర్‌పై వరుస సెట్లలో ఘనవిజయం సాధించి జోరు మీదున్న ఆమెకు ఈ అనారోగ్యం పెద్ద దెబ్బగా మారింది. మరోవైపు 34వ ర్యాంకులో ఉన్న ఆన్ లీకి ఇది చిరస్మరణీయ విజయం. తన కెరీర్‌లో టాప్-10 క్రీడాకారిణిపై విజయం సాధించడం ఆమెకు ఇది రెండోసారి. తదుపరి రౌండ్ (ప్రిక్వార్టర్స్)లో ఆన్ లీ కెనడా స్టార్ లేలా ఫెర్నాండెజ్‌తో తలపడనున్నారు.
