Let's talk: editor@tmv.in
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. నేడు ప్రమాణ స్వీకారం
బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. నేడు ప్రమాణ స్వీకారం

బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. నేడు ప్రమాణ స్వీకారం

Gaddamidi Naveen
9 మే, 2026

పశ్చిమ బెంగాల్‌ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. రాష్ట్రంలో దశాబ్దాల తరబడి కొనసాగిన "భయం అనే శకం" అంతమైందని, ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని పశ్చిమ బెంగాల్ కాబోయే ముఖ్యమంత్రి సువేందు అధికారి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఏర్పాటు కాబోతున్న మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వం సామూహిక నాయకత్వ సూత్రంతో పనిచేస్తుందని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో సువేందు అధికారిని ఏకగ్రీవంగా నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, రాబోయే ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.

"భయం పోయింది.. భరోసా వచ్చింది"

ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినట్లుగా బెంగాల్ ప్రజల మనసుల్లోంచి 'భయం' తొలగిపోయిందని, దాని స్థానంలో 'భరోసా' వచ్చిందని సువేందు అన్నారు. తన నాయకత్వంలోని ప్రభుత్వం వ్యక్తిగత అధికారం చుట్టూ తిరగదని, నేను కాకుండా మేము అనే సామూహిక నాయకత్వ భావనతో పనిచేస్తుందని 55 ఏళ్ల సువేందు అధికారి స్పష్టం చేశారు. బెంగాల్ ప్రజలు తమకు చారిత్రాత్మక విజయాన్ని అందించారని, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని ఆయన తెలిపారు.

విచారణ కమిషన్ల ఏర్పాటు

గత తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు, మహిళలపై జరిగిన దాడుల పట్ల సువేందు కఠినంగా స్పందించారు. గత ప్రభుత్వంలోని అవినీతి కేసులన్నింటినీ విచారించేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మహిళలపై జరిగిన అకృత్యాలపై విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఎన్నికల గ్యారెంటీలను, పార్టీ "సంకల్ప పత్రం"లోని అంశాలను దశలవారీగా అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల నాటికి కనీసం 60 శాతం మంది ప్రజల మద్దతును పొందేలా తమ ప్రభుత్వం సానుకూల పాలనను అందిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన ప్రసంగం ముగింపులో, పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రధాని మోడీ గౌరవార్థం ఒక నిమిషం పాటు నిలబడి చప్పట్లు కొట్టాలని ఆయన ఎమ్మెల్యేలను కోరారు.

అమిత్ షా అధికారిక ప్రకటన

అంతకుముందు జరిగిన సమావేశంలో ఎనిమిది ప్రతిపాదనలు, అవన్నీ సువేందు అధికారి పేరునే సూచించాయని అమిత్ షా వెల్లడించారు. రెండో పేరు కోసం తగినంత సమయం ఇచ్చినప్పటికీ, మరే ఇతర ప్రతిపాదన రాలేదని, అందుకే సువేందును ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం (నేడు) ఉదయం కోల్‌కతాలోని ప్రతిష్టాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగే భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ, అమిత్ షా, ఇతర సీనియర్ నాయకుల సమక్షంలో సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

చారిత్రాత్మక విజయం - రాజకీయ నేపథ్యం

సువేందు అధికారి నియామకంతో బెంగాల్ రాజకీయాల్లో మరో రికార్డు నమోదైంది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక జిల్లా స్థాయి నాయకుడు (పుర్బా మేదినిపూర్ జిల్లాకు చెందిన తామ్లుక్) ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. గతంలో 1970లో అజయ్ ముఖర్జీ ఇదే ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా పనిచేశారు. సువేందు అధికారి ప్రస్థానం కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం 'ఛాత్ర పరిషత్' నుంచి ప్రారంభమైంది. మాజీ కేంద్ర మంత్రి శిశిర్ అధికారి కుమారుడైన ఆయన, 1995లో కాంతి మున్సిపాలిటీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 1998లో మమతా బెనర్జీ టీఎంసీని స్థాపించినప్పుడు ఆయన అందులో చేరారు. 2007 నాటి నందిగ్రామ్ భూసేకరణ వ్యతిరేక ఉద్యమంలో మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్తుడైన సేనానిగా ఆయన పనిచేశారు. రెండుసార్లు ఎంపీగా, నందిగ్రామ్ ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

మలుపు తిప్పిన 2020..

2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, డిసెంబర్ 2020లో సువేందు టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. అదే ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించి 'జెయింట్ కిల్లర్'గా నిలిచారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీ లోపల, బయట టీఎంసీ సర్కార్‌పై పోరాటం సాగించారు. 2026 ఎన్నికల్లో మమతకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గంలో ఆమెను ఓడించి, టీఎంసీ 15 ఏళ్ల పాలనకు చరమగీతం పాడుతూ 207 స్థానాలతో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర‌ పోషించారు. పశ్చిమ బెంగాల్‌లో మొట్టమొదటి కాషాయ ప్రభుత్వాన్ని నడిపించబోతున్న సువేందు అధికారి ముందు ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం, శాంతిభద్రతల పరిరక్షణ వంటి భారీ సవాళ్లు ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తూ బెంగాల్‌ను మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.