


బెంగాల్ గడ్డపై బీజేపీ తొలి ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం
పశ్చిమ బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక నవశకం ఆరంభమైంది. కోల్‌కతాలోని చారిత్రాత్మక బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ శనివారం మధ్యాహ్నం కాషాయమయమైంది. స్వతంత్ర భారత చరిత్రలో పశ్చిమ బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేశారు. గత కొన్ని దశాబ్దాలుగా వామపక్షాలు, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బెంగాల్‌లో బీజేపీ సాధించిన ఈ విజయం భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది.
ప్రజా తీర్పుకు ప్రధాని సాష్టాంగ నమస్కారం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ నాయకత్వంతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రధాని మోడీ వేదికపైకి రాగానే, ప్రజలు తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనంగా వేదికపై మోకరిల్లి, తన నుదుటిని నేలకు తాకించి ప్రజలకు సాష్టాంగ నమస్కారం చేశారు. ఈ అపూర్వ దృశ్యాన్ని చూసిన వేలాది మంది అభిమానులు 'జై శ్రీరామ్' నినాదాలతో మైదానాన్ని హోరెత్తించారు. అనంతరం గవర్నర్ ఆర్.ఎన్. రవి సువేందు అధికారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు.
సమతుల్యతతో కూడిన మంత్రివర్గం
ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం, మరో ఐదుగురు సభ్యులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ ఆరుగురు సభ్యుల తొలి మంత్రివర్గంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతకు బీజేపీ పెద్దపీట వేసింది.
సువేందు అధికారి (ముఖ్యమంత్రి):
బ్రాహ్మణ సామాజిక వర్గం. భవానీపూర్, నందిగ్రామ్ రెండింటిలోనూ విజయం సాధించి బీజేపీ పోరాటంలో ముఖచిత్రంగా నిలిచారు.
దిలీప్ ఘోష్:
ఓబీసీ ప్రతినిధి. మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఖరగ్‌పూర్ సదర్ ఎమ్మెల్యే.
అగ్నిమిత్ర పాల్:
కాయస్థ సామాజిక వర్గం. అసన్సోల్ దక్షిణ ఎమ్మెల్యే, మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు.
అశోక్ కీర్తనియా:
మతువా కమ్యూనిటీ ప్రతినిధి. బంగావ్ ఉత్తర్ ఎమ్మెల్యే.
క్షుదిరామ్ తుడు:
జంగల్‌మహల్ ప్రాంత గిరిజన నాయకుడు.
నిశిత్ ప్రమాణిక్:
రాజ్బన్షి సామాజిక వర్గం, ఉత్తర బెంగాల్ కీలక నేత.
ఈ మంత్రివర్గంలో ముగ్గురు దక్షిణ బెంగాల్ నుంచి, ఇద్దరు ఉత్తర బెంగాల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, కోల్‌కతా నగరం నుంచి ఎవరికీ తొలి విడతలో చోటు దక్కకపోవడం గమనార్హం. మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం సోమవారం రాజ్‌భవన్‌లో జరిగే అవకాశం ఉంది.
మమత కోటలో 'సోనార్ బంగ్లా' ఉదయం
మొత్తం 294 స్థానాలున్న అసెంబ్లీలో బీజేపీ 207 స్థానాలు సాధించి, 15 ఏళ్ల మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు చరమగీతం పాడింది. ఒకప్పుడు వామపక్ష భావజాలానికి అడ్డాగా ఉన్న బెంగాల్‌లో, బీజేపీ తన సంస్థాగత బలాన్ని పెంచుకుంటూ, ఇతర పార్టీల నుంచి కీలక నేతలను ప్రోత్సహిస్తూ అద్భుత విజయాన్ని అందుకుంది. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ ఒకప్పుడు కమ్యూనిస్టుల సభలతో కిక్కిరిసిపోయేది, ఆ తర్వాత టీఎంసీ తన శక్తిని చాటుకోవడానికి దీనిని వేదికగా చేసుకుంది. ఇప్పుడు అదే మైదానంలో కాషాయ జెండాలు రెపరెపలాడటం బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన పెనుమార్పుకు చిహ్నంగా నిలిచింది. "డబుల్ ఇంజిన్ సర్కార్" ద్వారా 'సోనార్ బంగ్లా'ను (బంగారు బెంగాల్) నిర్మిస్తామన్న ప్రధాని మోడీ నినాదం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఈ విజయం నిరూపించింది.
మంత్రుల నేపథ్యం..
మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న నాయకుల రాజకీయ ప్రయాణం కూడా విశేషమే. దిలీప్ ఘోష్ ఖరగ్‌పూర్ సదర్ నుంచి మళ్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2016లో మొదటిసారి ఈ స్థానాన్ని గెలుచుకున్న ఆయన, 2019లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2024 సాధారణ ఎన్నికల్లో బర్దమాన్–దుర్గాపూర్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు పొందిన అగ్నిమిత్రా పాల్ 2019 లోక్‌సభ ఎన్నికల అనంతరం బీజేపీలో చేరి త్వరగానే రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలిగా ఎదిగారు. 2021లో గెలిచిన ఆసన్సోల్ దక్షిణ స్థానాన్ని ఈసారి కూడా నిలబెట్టుకున్నారు. అశోక్ కీర్తనియా బంగావ్ ఉత్తర్ నుంచి తిరిగి గెలిచి బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలోని మటువా ఓటు బ్యాంకుపై బీజేపీ పట్టును మరింత బలపరిచారు.
వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన క్షుదిరామ్ తుడు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసినా, ఈసారి రాణీబాంధ్ నుంచి విజయం సాధించి జంగల్‌మహల్ ప్రాంతంలో గిరిజన ముఖచిత్రంగా ఎదిగారు. నిశిత్ ప్రమాణిక్ 2019లో కూచ్‌బెహార్ నుంచి లోక్‌సభకు ఎన్నికై, తరువాత కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేశారు. ఈసారి మాథాభంగా అసెంబ్లీ స్థానంలో విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లోకి తిరిగి వచ్చారు.
