Let's talk: editor@tmv.in
ఏఐతో సోషల్‌ మీడియాపై నిఘా.. హైదరాబాద్ పోలీసుల చేతిలోకి సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'

ఏఐతో సోషల్‌ మీడియాపై నిఘా.. హైదరాబాద్ పోలీసుల చేతిలోకి సరికొత్త అస్త్రం 'సాక్ ఐ'

Gaddamidi Naveen
19 మే, 2026

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఎల్లప్పుడూ ముందంజలో ఉండే హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై ఉక్కుపాదం మోపేందుకు సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. 'సాక్ ఐ' (సాక్ ఐ - అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్) పేరుతో రూపొందించిన అత్యాధునిక కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత అప్లికేషన్‌ను పోలీస్ శాఖ ప్రారంభించింది. ఆన్‌లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని పసిగట్టడానికి, అసాంఘిక శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు విశ్లేషించేందుకు హైదరాబాద్ పోలీస్ ఐటీ విభాగం ఈ విప్లవాత్మక వ్యవస్థను అభివృద్ధి చేసింది.

గతంలో సోషల్ మీడియాను పర్యవేక్షించడానికి భారీగా సిబ్బంది అవసరమవ్వడమే కాకుండా, గంటల తరబడి మాన్యువల్‌గా శ్రమించాల్సి వచ్చేది. కానీ ఈ 'సాక్ ఐ' ద్వారా ఇకపై నిఘా ప్రక్రియ అంతా ఆటోమేటెడ్‌ పద్ధతిలో నిరంతరాయంగా జరుగుతుంది. దీనిలోని 'ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ డ్యాష్‌బోర్డ్' ద్వారా డయల్ 100 కాల్స్, అంతర్గత నిఘా సమాచారం, నగరంలో జరుగుతున్న ప్రధాన ఘటనల వివరాలను ఒకే చోట క్రోడీకరించి, ఉన్నతాధికారులకు క్షేత్రస్థాయి పరిస్థితిపై తక్షణ అవగాహన కల్పిస్తుంది.

సాక్ ఐ తన పైలట్ ప్రాజెక్ట్ దశలోనే అద్భుతమైన ఫలితాలను సాధించింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పురానాపూల్ ఎక్స్ రోడ్ ఘటనకు సంబంధించి 85 ద్వేషపూరిత, మతపరమైన సున్నితమైన అంశాలను ఇది విజయవంతంగా గుర్తించింది. వివిధ సోషల్ మీడియా ఖాతాలలో ఉన్న 126 వివాదాస్పద పోస్ట్‌లను గుర్తించింది. ఇలాంటి విద్వేషపూరిత కంటెంట్‌ను సకాలంలో తొలగించేలా తక్షణ చర్యలు చేపట్టడం ద్వారా నగరంలో శాంతి సామరస్యాలను కాపాడటమే కాకుండా, అల్లర్లు రేకెత్తించే వారిని గుర్తించడం సులువైంది.

మహిళల భద్రత, డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం

ఈ ఏఐ వ్యవస్థ ముఖ్యంగా మాదకద్రవ్యాల సరఫరా, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. చిన్నారులపై లైంగిక వేధింపుల కంటెంట్, సైబర్ బుల్లింగ్, స్టాకింగ్ (వేధింపులు) వంటి అంశాలను ఇందులోని ఏఐ మోడల్స్ స్వయంగా గుర్తించి పోలీసులను అప్రమత్తం చేస్తాయి. పోస్టుల తీవ్రతను బట్టి వాటిని హై, మీడియం, లో రిస్క్ కేటగిరీలుగా విభజించి, అభ్యంతరకర పోస్టులను తొలగించేలా సంబంధిత సోషల్ మీడియా సంస్థలకు నివేదిస్తుంది.

నేరగాళ్ల నెట్‌వర్క్ విశ్లేషణ, ముందస్తు నిఘా

వివాదాస్పద పోస్టులను పదేపదే షేర్ చేసే వారిని, వాటిని వైరల్ చేసే అకౌంట్లను ఈ యాప్ నెట్‌వర్క్ విశ్లేషణ సామర్థ్యంతో ఇట్టే పట్టేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులకు ఒక 'యూనిక్ ట్రాకింగ్ నంబర్' కేటాయించి, అది పరిష్కారమయ్యే వరకు ఎండ్-టు-ఎండ్ మానిటరింగ్ చేస్తుంది.

నగరంలో ప్రతిరోజూ జరిగే నిరసనలు, ర్యాలీలు, మతపరమైన ఊరేగింపులపై కీవర్డ్స్ ఆధారంగా ముందస్తు నిఘా ఉంచేందుకు 'ఈవెంట్ బేస్డ్ మానిటరింగ్' ఫీచర్‌ను ఇందులో చేర్చారు. అలాగే నేర పరిశోధనలో కీలకంగా మారిన సోషల్ మీడియా నిఘా సమాచారం వంటి ఇన్వెస్టిగేషన్ టూల్స్ ఇందులో అంతర్భాగంగా ఉండటంతో డిజిటల్ సాక్ష్యాల ఆధారంగా సైబర్ కేసుల ఛేదన సులభతరం కానుంది. దీనిలోని గ్లోబల్ సెర్చ్ ఇంజిన్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పబ్లిక్ ప్రొఫైల్స్ లోని కథనాలను తక్షణమే విశ్లేషిస్తుంది.

అత్యాధునిక ఏఐ సాంకేతికతతో కూడిన 'సాక్ ఐ' వ్యవస్థ పోలీసుల పనిభారాన్ని తగ్గించడమే కాకుండా, నేర నివారణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, ఐపీఎస్ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిని రేకెత్తించే శక్తుల ఆటకట్టించేందుకు, మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ, మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతికతతో నేరగాళ్లను సమర్థంగా ఎదుర్కొంటామని సీపీ స్పష్టం చేశారు.