Let's talk: editor@tmv.in
ఆశారాం ఆశ్రమ భూమిపై సుప్రీం స్టేటస్‌ క్వో

ఆశారాం ఆశ్రమ భూమిపై సుప్రీం స్టేటస్‌ క్వో

Pinjari Chand
28 ఏప్రిల్, 2026

అహ్మదాబాద్‌లోని స్వయం ప్రకటిత గాడ్‌మ్యాన్ ఆశారాం ఆశ్రమానికి కేటాయించిన భూమిపై సుప్రీం కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 4 వరకు యథాతథ స్థితిని (స్టేటస్‌ క్వో) కొనసాగించాలని ఆదేశించింది. ఈ భూమిని కామన్‌ వెల్త్‌ 2030 కోసం క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించాలని గుజరాత్ ప్రభుత్వం యోచిస్తోంది. అహ్మదాబాద్‌లోని మోతెరా ప్రాంతంలో నరేంద్ర మోడీ స్టేడియం సమీపంలో ఉన్న సుమారు 45,000 చదరపు మీటర్ల స్థలంలో ఈ ఆశ్రమం ఉంది. ఈ ప్రాంతంలో ప్రతిపాదిత సర్దార్‌‌ పటేల్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూమి స్వాధీనం ప్రక్రియను సవాల్ చేస్తూ సంత్‌ శ్రీ ఆశారాం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గుజరాత్ హైకోర్టు ఏప్రిల్ 17న ఇచ్చిన తీర్పును ట్రస్ట్ సవాల్ చేసింది. ఆ తీర్పులో లీజ్ నిబంధనల ఉల్లంఘన, అక్రమ ఆక్రమణల కారణంగా భూమిని స్వాధీనం చేసుకోవడం సక్రమమైందేనని హైకోర్టు పేర్కొంది.

ట్రస్ట్‌కు సరైన నోటీసులు ఇవ్వలేదు

న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్ం, సందీప్‌ మెహతాల బెంచ్ విచారణ చేసింది. మొదటి గమనికగా ట్రస్ట్‌కు సరైన నోటీసులు ఇవ్వలేదని కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ తరఫున హాజరైన తుషార్‌‌ మెహతా , లీజ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు, అనుమతులు లేకుండా 30కి పైగా భవనాలు నిర్మించారని కోర్టుకు తెలిపారు. ఇక ట్రస్ట్ తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ , ఈ భూమి సామాజిక సేవా కార్యక్రమాలు, పాఠశాల కోసం కేటాయించిందని, ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదని తెలిపారు. కోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని సంబంధిత రికార్డులు సమర్పించాలని ఆదేశిస్తూ, ట్రస్ట్‌కు కూడా సమయం ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణను మే 4కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ఆ తేదీ వరకు భూమిపై ఎటువంటి కూల్చివేతలు చేపట్టవద్దని స్పష్టం చేసింది. ఇప్పటికే 84 ఏళ్ల ఆశారాం , 2013లో రాజస్థాన్‌లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. వైద్య కారణాలపై ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. గాంధీనగర్ కోర్టు కూడా మరో అత్యాచారం కేసులో అతనికి జీవిత ఖైదు విధించింది. గుజరాత్ హైకోర్టు తన తీర్పులో, ట్రస్ట్ లీజ్ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, సబర్మతి నదీ పరివాహక ప్రాంతంలో కూడా అక్రమ ఆక్రమణలు చేసినట్టు పేర్కొంది. ఈ కేసు నేపథ్యంలో, ప్రభుత్వం క్రీడా ప్రాజెక్ట్ కోసం భూమి స్వాధీనం ప్రక్రియ కొనసాగుతుండగా, సుప్రీంకోర్టు జోక్యంతో తాత్కాలికంగా పరిస్థితి యథాతథంగా నిలిచింది.